Mahaa Daily Exclusive

  కేసీఆర్‌ హయాంలోనే ఏపీ ప్రాజెక్టులకు పునాది!

Share

కేసీఆర్‌ హయాంలోనే ఏపీ ప్రాజెక్టులకు పునాది!
• 299 టీఎంసీలకు ఒప్పుకుని తెలంగాణ గొంతు కోశారు.
• మా హయాంలో ఒక్క ప్రాజెక్టూ చేపట్టలేదు.
• మంచి ఉంటే మైక్‌లో చెప్పండి.. చెడు ఉంటే నా చెవిలో చెప్పండి.
• వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లే కాంగ్రెస్‌ టార్గెట్‌.
• రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం.
• ఎల్‌నినో కరవును ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్ల సాయం కోరుతూ కేంద్రానికి తీర్మానం.
• ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణ నీటి ప్రయోజనాలకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే కోలుకోలేని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని, కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ఉండేలా నాడు సంతకాలు పెట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఆ కేటాయింపుల ఆధారంగానే ఏపీలో ప్రాజెక్టులు కట్టుకున్నారని, తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం కనీసం భూసేకరణ నిధులు కూడా ఇవ్వకుండా గాలికి వదిలేశారని కేసీఆర్‌ను నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆంధ్రాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టలేదని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో నూతన ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి బి.ఎం. సందీప్‌ సమక్షంలో జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌.. పోతిరెడ్డిపాడు కేసీఆర్‌, జగన్‌ పాపమే!

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పథకం 2022లో కేసీఆర్‌, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే మొదలైందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.1,580 కోట్ల రుణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా అప్పుడే వచ్చాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమకు నీటి తరలింపు అంతా నాటి పాలకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని మండిపడ్డారు. అయితే, 2015లో కుదిరిన 299:512 టీఎంసీల వాటా తాత్కాలిక కార్యాచరణ ఒప్పందం మాత్రమేనని, అది శాశ్వత హక్కుల పంపిణీ కాదని నీటిపారుదల రంగ నిపుణులు, బోర్డు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఆ నిష్పత్తి కొనసాగడంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.

మంచి ఉంటే మైక్‌లో.. చెడు ఉంటే చెవిలో చెప్పండి.

పార్టీలో అంతర్గత క్రమశిక్షణపై సీఎం రేవంత్‌రెడ్డి సొంత పార్టీ నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలపై సీనియర్‌ నేతలు అభ్యంతరం తెలపడంతో సీఎం ఘాటుగా స్పందించారు. “పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వీధుల్లోకి వచ్చి మాట్లాడితే ఇకపై ఉపేక్షించేది లేదు. ఈ ఒక్కసారికి వదిలేద్దాం, మళ్లీ పునరావృతమైతే వేటు తప్పదు. మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పండి.. చెడు విషయాలు ఉంటే నా చెవిలో చెప్పండి” అని హితవు పలికారు. తన వల్లగానీ, మంత్రుల వల్లగానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కొత్త ఇన్‌చార్జి సందీప్‌కుమార్‌ దృష్టికి తీసుకురావాలని, కూర్చుని పరిష్కరించుకుందామని సూచించారు. ఎవరు ముందు ఏం మాట్లాడుతున్నారు, వెనుక ఏం చేస్తున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, వ్యూహాలు, ఎత్తుగడలు తమకు వదిలేయాలని స్పష్టం చేశారు.

కోటి ఓట్లు.. 90 సీట్లు.. రెండోసారి అధికారం మనదే!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోటి ఓట్లు సాధించి 90 స్థానాలు గెలుచుకోవడమే కాంగ్రెస్‌ లక్ష్యమని రేవంత్‌రెడ్డి శంఖారావం పూరించారు. రాజకీయాల్లో బ్యాలెన్స్‌ షీట్‌ ఐదేళ్లకు ఒకసారి వస్తుందని, ఎన్నికల సమయంలోనే ప్రతి ఒక్కరి పనితీరును కొలుస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కచ్చితంగా రెండోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజాబలం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని, ఈ కార్యక్రమానికి నిధుల కొరత ఉండదని భరోసా ఇచ్చారు.

ఎల్‌నినోపై ఆందోళన.. రూ.30 వేల కోట్ల సాయానికి తీర్మానం.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న ఎనిమిది నెలలు తాగునీటి సరఫరా ప్రభుత్వానికి పెను సవాలుగా మారనుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణకు తక్షణమే రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అలాగే 2027 జనగణనలో ఓబీసీ కులగణనను చేర్చాలని ప్రధాని మోదీకి లేఖ రాయాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు. మరోవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని, దళితులు, గిరిజనులు, మహిళల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ‘జ్ఞానేశ్‌కుమార్‌ గో బ్యాక్‌’ నినాదంతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.