- పదవులపై.. ఆశలు
- 30వేల పదవులు పెండింగ్
- నామినేటెడ్ పదవులన్నీ ఖాళీ
- మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఖాళీ
- జడ్పీ, మండలపరిషత్, గ్రేటర్ కార్పోరేషన్ల ఎన్నికలూ పెండింగ్
- సొసైటీ ఛైర్మన్ పదవులు కూడా.. పెండింగ్
- పదవుల కోసం కార్యకర్తలు, నాయకుల వెయిటింగ్
- అధికారంలో ఉన్నా.. పదవోత్సాహం కరువు
- వ్యూహం మాది.. క్షేత్రం మీది అంటూ సీఎం రేవంత్ కొత్త స్లోగన్
- కొత్త ఇన్ ఛార్జి రాకతో పదవుల భర్తీ వేగం పుంజుకుంటుందన్న ఆశ
- త్వరలో డీసీసీల మార్పులు జరిగే అవకాశం.. వర్కింగ్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధుల నియామకం కూడా త్వరలో
(మహా నెట్ వర్క్ )
రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పదవుల కోసం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. మండల స్థాయి నేతలకు, మండలాల్లో కీలకంగా ఉన్న నేతలకు, నియోజకవర్గ స్థాయి నేతలకు గత మూడేళ్ళలో ఏ పదవులు దక్కలేదు. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగకపోవడంతో ఆరువేలకు పైగా పదవులు కార్యకర్తలకు దక్కే ఛాన్స్ మిస్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంపీపీ కావాలని, జడ్పీటీసీ కావాలని, జడ్పీ ఛైర్మన్ కావాలని అనేకమంది లెక్కలు వేసుకున్నారు. కానీ అవి నెరవేరలేదు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు సహా పలు మునిసిపాలిటీల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక వందకు పైగా నామినేటెడ్ ఛైర్మన్ పదవులు, వేలాది దైరెక్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక పీఏసీఎస్ ఛైర్మన్లు వందల్లో, పీఏసీఎస్ డైరెక్టర్ పోప్టులు వేలల్లో ఖాళీలున్నాయి. తాజాగా మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయినా వీటి భర్తీకి కూడా కసరత్తు జరగలేదు. మండల స్థాయి నుండి ఇలా రాష్ట్రస్థాయి వరకు దాదాపు 30వేల పోస్టులు భర్తీచేసే అవకాశమున్నా, 30వేల మంది నాయకుల గౌరవం పెంచే అవకాశమున్నా పార్టీ ఆ పనిచేయడం లేదు. నూతన ఇన్ ఛార్జి బీఎం సందీప్ రాకతోనైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందని, పదవుల జోరుపెరుగుతుందన్న చర్చ ఉంది.
డీసీసీలలో మార్పులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే పార్టీలోనూ, ప్రభుత్వలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. గత ఇన్ ఛార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రిని నమ్ముకున్న వారిని పక్కనబెట్టి ఇండిపెండెంట్ గా రాజకీయ లెక్కలతో సంబంధం లేకుండా డీసీసీలు ఏకపక్షంగా ప్రకటించిందన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల కోణంలో పలు డీసీసీల మార్పులు జరగనున్నాయి. పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు, అధికార ప్రతినిధుల పదవులకు కూడా మోక్షం కలగనుంది. అయితే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై అనుమానాలున్నాయి. నామినేటెడ్ పదవులన్నా భర్తీచేస్తే బాగుంటుందని, వేలాది పదవులు పెండింగ్ లో ఉన్నాయని నేతలు అంటున్నారు. ఫలితంగానే అధికారం ఉన్నా క్యాడర్ లో పదవోత్సాహం కరువైంది. కార్యకర్తల కోసం అధికారంలోకి వస్తామంటే క్యాడర్ నమ్మేలా అనిపించడం లేదు. నామినేటెడ్ ఎమ్మెల్సీలపై కూడా నేతల్లో చర్చ ఉంది.
వ్యూహం మాది
రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది. కచ్చితంగా ఎన్నికల సమయంలో కొలుస్తాం. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తుంది. వ్యూహాలు, ఎత్తుగడలు మాకు వదిలేయండి. ఎవరేం చేస్తున్నారో డేటా మా దగ్గర ఉంది. ముందేం మాట్లాడుతున్నారు. వెనకేం మాట్లాడుతున్నారు అన్నది మాకు తెలుసు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ఇన్ ఛార్జ్ సందీప్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపారు. అయితే పదవుల భర్తీతోనే నేతల్లో ఉత్సాహం కనిపించే అవకాశముంది. పార్టీ పదవులు కూడా బలమైన నేతలను పక్కనబెట్టి విచిత్రంగా నియామకాలు జరిగాయన్న చర్చ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవుల భర్తీపై ఆదినుండీ దూకుడుగా ఉన్నా పార్టీలోని పరిస్థితులు, జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు అనుకూలంగా లేక భర్తీ వాయిదాపడుతూ వచ్చింది. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ లో పదవుల బొనాంజా వస్తుందన్న ఆశ క్షేత్రస్థాయి క్యాడర్ లో ఉంది.
………








