- హిందువులందరూ విశ్వహిందూ పరిషత్లో సభ్యత్వం తీసుకోవాలి: బాలస్వామి
- కుల, ప్రాంత, వర్గ, రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం సంఘటితం కావాలి
హైదరాబాద్, మహా : కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయ భేదాలకు అతీతంగా హిందువులందరూ విశ్వహిందూ పరిషత్లో సభ్యత్వం తీసుకుని సమాజ ఐక్యతకు కృషి చేయాలని ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పిలుపునిచ్చారు. హిందూ సమాజం ఐక్యంగా, సంఘటితంగా ఉన్నప్పుడే ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోగలమని పేర్కొన్నారు.
ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సభ్యత్వ నమోదు ఆవశ్యకతను వివరించారు.
హిందూ సమాజంలో ఐక్యత లోపించడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, కులాలు, రాజకీయాల పేరుతో విభేదించకుండా సామాజిక సమరసతతో ముందుకు సాగాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణ, గోవుల సంరక్షణ, ధార్మిక సంప్రదాయాల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవి, నాయకులు సత్యనారాయణ, బొక్కి సాయిలు, సత్యప్ప, ఎంగలి సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.








