Mahaa Daily Exclusive

  నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది కేసీఆరే!

Share

నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది కేసీఆరే!
* పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఇప్పుడు నీతులు చెబుతారా?
* 2020లో 66:34 నిష్పత్తికి అంగీకారం.
* 2015లో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు చాలన్నది మీరే!
* పల్నాడు వాటర్‌ గ్రిడ్‌కు జీవో ఇచ్చింది మీ ప్రభుత్వమే
చుక్క నీటిని కూడా వదులుకోం.
* బీఆర్‌ఎస్‌ అబద్ధాల ప్రచారానికి ఆధారాలతో సమాధానం చెబుతాం.
* సీఎం రేవంత్‌ రెడ్డి.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణ నీటి హక్కులను కాపాడటంలో గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. నీటి విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి జలాలపై వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

512 టీఎంసీలకు అంగీకరించింది మీరే కాదా?

బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించిందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 71 శాతం కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నందున 575 టీఎంసీల వాటా కోసం తమ ప్రభుత్వం పోరాడుతోందన్నారు. అయితే 2015లో కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్‌ అంగీకరించారని ఆరోపించారు. 2020లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలోనూ 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు కొనసాగించేందుకు అంగీకరించడం తెలంగాణకు నష్టం కలిగించిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను వదులుకున్నది ఎవరో ప్రజలు గుర్తించాలని వ్యాఖ్యానించారు.

పల్నాడు వాటర్‌ గ్రిడ్‌కు అనుమతించింది మీ ప్రభుత్వమే!

ఏపీ పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీటిని తరలించుకుపోతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకోవడం లేదన్న ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. 2022 ఫిబ్రవరి 16న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 56తోనే ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని వివరించారు. గ్రామీణ నీటి సరఫరా కింద 13 జిల్లాలకు తాగునీరు అందించే పేరుతో రూ.1,200 కోట్లతో గుంటూరు జిల్లా పల్నాడుకు నీటిని తరలించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని, జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం నుంచి రూ.500 కోట్ల మ్యాచింగ్‌ గ్రాంట్‌ పొందేలా అంగీకరించారని పేర్కొన్నారు. ఈ జీవోపై అప్పట్లో కేసీఆర్‌ కృష్ణా బోర్డు వద్దగానీ, కేంద్రం వద్దగానీ అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నీటి హక్కుల గురించి మాట్లాడతారా?

పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచేందుకు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా అప్పట్లో అనుమతులు ఇచ్చారని విమర్శించారు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. ఏపీలో పోతిరెడ్డిపాడు, జీఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌, రాజోలిబండ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో రాయలసీమలో ఎనిమిది ప్రాజెక్టులు నిర్మాణం కాగా, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు.

చుక్క నీటిని కూడా వదులుకోం!

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2023-24లో 119 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగా, ప్రజా ప్రభుత్వం 2024-25లో 285 టీఎంసీల నీటిని వినియోగించిందని సీఎం గణాంకాలను వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఆ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి వద్ద ఒత్తిడి తెస్తున్నామని, సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నామని చెప్పారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వచ్చేలా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, రాజకీయంగా, న్యాయపరంగా తమ పోరాటం కొనసాగుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.