Mahaa Daily Exclusive

  ఆసియాలో భారత్‌ పవర్‌….

Share

ఆసియాలో భారత్‌ పవర్‌.
* మోదీకి నాయకత్వంలో రెండో స్థానం!
* షీ జిన్‌పింగ్‌ తర్వాత అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నేతగా మోదీ.
* 40.5 పాయింట్లతో ప్రధాన శక్తిగా భారత్‌.

న్యూఢిల్లీ, మహా:

ఆసియాలో భారత్‌ తన శక్తి, ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత్‌.. ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన 2026 ఆసియా పవర్‌ ఇండెక్స్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాలో రెండో అత్యంత సమర్థవంతమైన ప్రాంతీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మొదటి స్థానంలో నిలిచారు. 2026 నివేదిక ప్రకారం భారత్‌ 100కు 40.5 పాయింట్లు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 0.5 పాయింట్లు మెరుగుపరుచుకుంది.

చైనాతో తగ్గుతున్న శక్తి అంతరం

2018లో ఆసియా పవర్‌ ఇండెక్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌, చైనా మధ్య శక్తి అంతరం క్రమంగా తగ్గుతూ వస్తోందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం చైనా 73.6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, భారత్‌ 40.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇరు దేశాల మధ్య అంతరం 2018 తర్వాత అత్యల్ప స్థాయికి చేరింది. ఆర్థిక సామర్థ్యం, సైనిక బలం, వ్యూహాత్మక వనరులు, దౌత్య ప్రభావం, రక్షణ సంబంధాలు, సాంస్కృతిక ప్రాబల్యం వంటి ఎనిమిది ప్రధాన ప్రమాణాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. మొత్తం 27 దేశాలు, ప్రాంతాలను 131 సూచికలతో అంచనా వేశారు.

రక్షణ సంబంధాలు.. బ్రహ్మోస్‌తో పెరిగిన ప్రభావం

ఆగ్నేయాసియా దేశాలతో భారత్‌ రక్షణ సహకారాన్ని విస్తరించడం, బ్రహ్మోస్‌ క్షిపణుల విక్రయాలు దేశ ప్రాంతీయ ప్రభావాన్ని పెంచాయని నివేదిక పేర్కొంది. రక్షణ నెట్‌వర్క్‌ విభాగంలో భారత్‌ 9వ స్థానానికి చేరింది. సాంస్కృతిక ప్రభావంలోనూ పురోగతి సాధించింది. భవిష్యత్‌ వనరుల విభాగంలో భారత్‌ మూడో స్థానంలో నిలవడం దేశ దీర్ఘకాలిక అవకాశాలను సూచిస్తోంది. అయితే ఆర్థిక సామర్థ్యంలో స్వల్ప తగ్గుదల, గల్ఫ్‌ ప్రాంత సంఘర్షణ సమయంలో భారత్‌ దౌత్యపరంగా తక్కువ స్థాయిలో కనిపించడం వంటి అంశాలు నివేదికలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ పరిణామాలు మోదీ నాయకత్వంపై అంతర్జాతీయ అభిప్రాయాలను కొంత ప్రభావితం చేశాయని విశ్లేషించింది.

అగ్రస్థానంలో అమెరికా.. రెండో స్థానంలో చైనా

ఆసియా పవర్‌ ఇండెక్స్‌ 2026లో అమెరికా 78.9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. చైనా 73.6 పాయింట్లతో రెండో స్థానంలో, భారత్‌ 40.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. జపాన్‌ 38.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, రష్యా 32.2 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. ఆస్ట్రేలియా 31.7, దక్షిణ కొరియా 31.0, సింగపూర్‌ 26.9, ఇండోనేషియా 21.7, మలేషియా 20.5 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా ఆసియా దేశం కాకపోయినా, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంపై దాని ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రభావం కారణంగా ఈ సూచీలో చేర్చారు.

ఆసియాలో భారత్‌ ప్రభావం పెరుగుతున్నప్పటికీ ఆర్థిక, దౌత్య, రక్షణ రంగాల్లో మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నివేదిక విశ్లేషణ సూచిస్తోంది. ప్రాంతీయ శక్తిగా భారత్‌ ఎదుగుదలకు భవిష్యత్‌ వనరులు, రక్షణ భాగస్వామ్యాలు, సాంస్కృతిక ప్రభావం కీలకంగా మారుతున్నాయి.