Mahaa Daily Exclusive

  ప్రియాంశ్‌ ఆర్య విధ్వంసం.

Share

  •  181 పరుగులతో చరిత్ర!
  •  క్రిస్‌గేల్‌ రికార్డు బద్దలు.
  •  భారత టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు

ఇండోర్‌, మహా.

భారత యువ క్రికెటర్‌, ఢిల్లీ జట్టు ఆటగాడు ప్రియాంశ్‌ ఆర్య టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు సాధించి భారత పురుషుల టీ20 చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు లుహాన్‌-డ్రే ప్రిటోరియస్‌ నెలకొల్పిన 188 పరుగుల ప్రపంచ రికార్డుకు కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచాడు.

18 బంతుల్లోనే అర్ధశతకం

ఇండోర్‌లోని డాలీ కాలేజ్‌ మైదానంలో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీకి ప్రియాంశ్‌ ఆర్య మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ 36 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. మరో 24 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. బౌండరీలతో పాటు సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానం నలుమూలలా పరుగులు రాబట్టాడు.

క్రిస్‌గేల్‌ రికార్డు బద్దలు

సిద్ధార్థ్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ బాదిన ప్రియాంశ్‌.. వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న 175 పరుగుల వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. 2013లో గేల్‌ నెలకొల్పిన ఈ రికార్డు దాదాపు 13 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే గత నెలలో దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రిటోరియస్‌ 188 పరుగులతో దానిని అధిగమించాడు. తాజాగా ప్రియాంశ్‌ ఆర్య 181 పరుగులతో భారత ఆటగాళ్లలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన రికార్డును ఫిన్‌ అలెన్‌తో కలిసి పంచుకున్నాడు.

ఢిల్లీ భారీ స్కోరు

ప్రియాంశ్‌ ఆర్య విధ్వంసకర ఇన్నింగ్స్‌ అండతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోరు సాధించింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ చరిత్రలో ఇది సంయుక్తంగా మూడో అత్యధిక స్కోరు. ఈ టోర్నీలో ఢిల్లీ జట్టు నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదుసార్లు 200 పరుగుల మార్కును దాటింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఈ మార్కును అందుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లోనే ఢిల్లీ ఓటమి చవిచూసింది.

ఐపీఎల్‌లోనూ సత్తా

ప్రియాంశ్‌ ఆర్య ప్రతిభను గుర్తించిన పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం ఐపీఎల్‌ 2027 వేలానికి ముందు అతడిని జట్టులో కొనసాగించింది. ఐపీఎల్‌ 2026లోనూ వేగంగా పరుగులు సాధించే ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. తాజాగా దేశవాళీ టీ20 క్రికెట్‌లో ఏకంగా 181 పరుగులు సాధించి తన సత్తా చాటడంతో అతడిపై క్రికెట్‌ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Latest