Mahaa Daily Exclusive

  ‘నషా ముక్త్ భారత్’ 140 కోట్ల ప్రజల సామాజిక ఉద్యమం. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి.

Share

హైదరాబాద్, మహా.

‘నషా ముక్త్ భారత్’ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, 140 కోట్ల మంది ప్రజల సామాజిక ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్’ పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి యువ జనాభా భారత్ సొంతమని, అలాంటి యువతను డ్రగ్స్ మహమ్మారి బారి నుంచి కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత భారత్ సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ ఇండియా, హోల్ ఆఫ్ 140 క్రోర్స్ పీపుల్’ విధానంతో ముందుకెళ్తోందని తెలిపారు. ఇది పోలీసులదో, ప్రభుత్వాలదో బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు భాగస్వాములయ్యే మహా ప్రజా ఉద్యమంగా సాగాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయం, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రంగాల్లో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ రాష్ట్రం నేడు డ్రగ్స్ వ్యాప్తితో ఏ విధంగా నిర్వీర్యమవుతోందో కళ్లముందు కనిపిస్తోందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి క్రమంగా హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు విస్తరిస్తోందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. పొరుగు దేశాల్లోని భారత వ్యతిరేక, ఉగ్రవాద శక్తులు తమ ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకునేందుకు భారత్‌లోకి డ్రగ్స్ సరఫరా చేస్తూ, ఆ సొమ్ముతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు.

ఆధునిక జీవనశైలిలో ఉమ్మడి కుటుంబాలు తగ్గి న్యూక్లియర్ కుటుంబాలు పెరగడం, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో నిమగ్నమవడం వల్ల పిల్లల్లో ఒంటరితనం పెరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతూ యువత కొత్త పరిచయాల ద్వారా మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, పట్టణ ప్రాంతాల్లో 25 శాతం మంది యువత ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. మత్తు పదార్థాల సమస్య ధనికుల పిల్లలకే పరిమితం కాదని, హైదరాబాద్‌లోని అంబర్‌పేట, బోరబండ వంటి బస్తీల్లోని పేద కుటుంబాల యువత కూడా గంజాయి వంటి వాటికి బానిసలవుతున్నారని, సాయంత్రం వేళ వీధి లైట్లు పగలగొట్టి చీకట్లో డ్రగ్స్ వాడుతున్నారని బస్తీ మహిళలు కన్నీటితో తనకు చెప్పారని వివరించారు.

2029 నాటికి ‘నషా ముక్త్ భారత్’ సాధించాలనే లక్ష్యంతో కేంద్రం పటిష్ట కార్యాచరణ రూపొందించిందని కిషన్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ తయారీ సంస్థలను నెంబర్-1 టార్గెట్‌గా, సరఫరా చేసే స్మగ్లర్లను నెంబర్-2 టార్గెట్‌గా ఎంచుకుని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, డ్రగ్స్ వినియోగించే యువతను నేరస్థులుగా చూడకూడదని, ఆ తప్పు వారిది కాదని సూచించారు. ఎవరైనా విద్యార్థి లేదా యువకుడు డ్రగ్స్ ఊబిలో చిక్కుకుంటే తోటివారు హేళన చేయకుండా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెలివేయకుండా, బయటకు ప్రచారం చేయకుండా అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పి గౌరవప్రదంగా బయటకు తీసుకురావాలని కోరారు.

సరిహద్దుల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి పారామిలిటరీ బలగాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, జాగిలాల సంఖ్యను, స్పెషల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల పిల్లలకు ఉచిత వైద్యం అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 300 పునరావాస కేంద్రాలను 2,000కు పెంచాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. వీటిలో కార్పొరేట్ (సీఎస్ఆర్), స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని, మీడియా కూడా బాధితుల ఫోటోలు వేయకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా కథనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించడంతో పాటు, తొలి దశలో లక్ష మంది ‘నషా ముక్త్ భారత్ మిత్ర’ వాలంటీర్లను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

యువతను వ్యసనాల వైపు వెళ్లకుండా కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’, ‘యోగా’ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ భూములను అమ్మకుండా కాపాడి, ప్రతి గ్రామంలోనూ యువత కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే డీ-అడిక్షన్ కేంద్రాల నుంచి కోలుకున్న యువతకు మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించే అవకాశం కల్పించడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఇచ్చి కొత్త జీవితాన్ని అందించాలని పిలుపునిచ్చారు.