- మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టి. హరీశ్‌రావు.
హైదరాబాద్, మహా.
జల వనరుల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాల వరద పారిస్తూ, బీఆర్ఎస్పై బురదజల్లేందుకు విఫలయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టి. హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆధారాలతో సహా పలు అంశాలను ఆయన వివరించారు. నీళ్లు ఎత్తమంటే దుమ్మెత్తి పోస్తున్నారని, మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టి అతి తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎంతగా నోరు పెంచి నిందలు వేసినా అబద్ధాలు నిజాలు కావని, ప్రజలు తమకంటే ఎంతో తెలివైనవారని స్పష్టం చేశారు.
కేసీఆర్‌ను ఉరి తీయాలని రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఉద్యమం చేయడం తప్పా, ప్రాణాలు ఫణంగా పెట్టి తెలంగాణ సాధించడం తప్పా, పదవులకు రాజీనామాలు చేయడం తప్పా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా జలాల్లో నీటి హక్కులు సాధించడం తప్పా అన్నట్లు మాట్లాడుతున్నారని, ఉద్యమ సమయంలో సమైక్యవాదుల చెంత చేరి తెలంగాణ బిడ్డలపై తుపాకీ గురిపెట్టడమే ఒప్పన్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాడు రాజీనామా చేయకుండా జిరాక్స్ కాగితాలతో నాటకాలు ఆడారని, రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే ప్రభుత్వాన్ని కూల్చేందుకు నోట్ల కట్టలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని గుర్తుచేశారు. పాలమూరు నుంచి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి వలసలకు, ఎండిపోయిన బావులు, కాలిపోయిన మోటార్లకు గత కాంగ్రెస్, టీడీపీ పాలనలే కారణమని, ఆ పరిస్థితుల్లోనే గులాబీ జెండా పుట్టిందని అన్నారు.
నాగార్జునసాగర్ కుడి కాల్వ నిర్వహణకు ప్రభుత్వ నిధులు ఇచ్చి, ఎడమ కాల్వకు రైతుల డబ్బులు వసూలు చేసినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదని హరీశ్‌రావు నిలదీశారు. కేసీఆర్ హాలియా నుంచి పాదయాత్రకు బయలుదేరిన తర్వాతే ఎడమ కాల్వకు ప్రభుత్వ నిధులతో నిర్వహణ చేపడుతూ జీవో ఇచ్చారని తెలిపారు. జూరాల ఆయకట్టుకు కర్ణాటకకు డబ్బులు చెల్లించకముందు పది వేల ఎకరాలకు కూడా నీరు రాలేదని, కేసీఆర్ నిలదీతతోనే నీళ్లు వచ్చాయని చెప్పారు. ఉమ్మడి మెదక్‌లో ఒక్క ఎకరాకు నీరు పారని స్థితి నుంచి కేసీఆర్ పోరాటంతో ఆయకట్టు సాధ్యమైందని, ఎస్సారెస్పీ కింద 5 లక్షల ఎకరాలకు బదులు 9 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని వివరించారు. ఎస్సారెస్పీ స్టేజీ-2లో తుమ్మలు మొలిస్తే, ఎల్లంపల్లి పూర్తి చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్మించిందని అన్నారు. 30 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరులో 30 వేల ఎకరాలకు నీరు ఇస్తే, బీఆర్ఎస్ హయాంలో 4 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను 75 శాతానికి పైగా పూర్తి చేశామని, ప్యాకేజీ-3లో రెండు మూడు కిలోమీటర్లు తవ్వితే 50 టీఎంసీలు లిఫ్ట్ చేయవచ్చని చెప్పారు. అయితే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక చంద్రబాబుకు గురుదక్షిణగా జీవోలు ఇచ్చి, 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి నీళ్లు పారేలా చేసి పాలమూరుకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
మూడేళ్ల పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు ఆయకట్టు ఇచ్చారో, ఒక్క టీఎంసీ రిజర్వాయర్ అయినా కట్టారా అన్నది బయటపెట్టాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో 218 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించామని, 47 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కల్పించామని, మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, మిషన్ భగీరథతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపామని చెప్పారు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తి లిఫ్టులు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పల్నాడు ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, కేటీఆర్ బయటపెట్టిన తర్వాత బ్యాక్‌డేట్‌తో లేఖలు రాసి రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. 2022 నాటి జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామన్న ప్రస్తావన లేదని, రేవంత్ వచ్చాకే జీవో 453, 458, 483ల ద్వారా నీటి తరలింపు అంశాలు వచ్చాయని అన్నారు. 299:512 టీఎంసీల వాటా అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులే కారణమని, తెలంగాణ ఏర్పడిన 42 రోజుల్లోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ట్రిబ్యునల్ కోసం పోరాడారని గుర్తుచేశారు. 17.02.2025 సమావేశంలో రేవంత్ ప్రభుత్వమే 299:512 తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించిందని ఆరోపించారు. నీటి వినియోగంలో 2024-25లో 28 శాతం, 2025-26లో 25 శాతంతో అత్యల్ప వినియోగం నమోదైందని, రాయలసీమ లిఫ్ట్‌ను ఎన్జీటీ, కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ వేదికలుగా బీఆర్ఎస్ 19 లేఖలతో అడ్డుకుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో పదవులను తృణప్రాయంగా వదిలేసి అసెంబ్లీలో 42 రోజులు పోరాడింది తామేనని, అప్పటి కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని విమర్శించారు. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా వారం పది రోజులు చర్చకు తాము సిద్ధమని, కేసీఆర్ సరైన సమయంలో ప్రజల ముందుకు వచ్చి ఎండగడతారని హరీశ్‌రావు అన్నారు. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








