Mahaa Daily Exclusive

  తెలంగాణలో పనిచేయడం సంతృప్తినిచ్చింది.

Share

  •  కాంగ్రెస్‌ నాయకత్వానికి కృతజ్ఞతలు.
  •  సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్‌గౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
  •  కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు శుభాకాంక్షలు.
  •  పార్టీ మాజీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పార్టీ మాజీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పనిచేసిన సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఇక్కడి అనుభవాలు తనకు ప్రత్యేకమని తెలిపారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌తో తన అనుబంధం, పార్టీ నాయకుల సహకారం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు, పార్టీ అనుసరిస్తున్న లక్ష్యాలపై మాట్లాడారు.

తెలంగాణలో తన బాధ్యతల నిర్వహణకు సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర మంత్రులకు మీనాక్షి నటరాజన్‌ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయడంలో, రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేయడంలో అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల నూతన ఇన్‌చార్జిగా నియమితులైన బీఎం సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ చేసిన త్యాగం, కృషి కీలకమని మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలనే లక్ష్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ విలువలకు అనుగుణంగా ప్రభుత్వం, పార్టీ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

బీఎం సందీప్‌కు బాధ్యతలు

కాగా, తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ స్థానంలో బీఎం సందీప్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం నవంబర్‌ 14న నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన బీఎం సందీప్‌ గతంలో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఏఐసీసీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను బలోపేతం చేయడం, రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం సాధించడం ఆయన ముందున్న ప్రధాన బాధ్యతలుగా ఉన్నాయి.

కొత్త ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బీఎం సందీప్‌ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ విభాగాలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో విడివిడిగా చర్చించారు. రానున్న రెండేళ్లలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.