Mahaa Daily Exclusive

  వరంగల్ లో పసికందు విక్రయం కలకలం!

Share

  • వరంగల్ లో పసికందు విక్రయం కలకలం!
  • 4 నెలల పసికందును అమ్మిన ఘటనలో 12 మంది అరెస్ట్
  • 48 గంటల్లో ముఠా గుట్టురట్టు చేసిన మట్టెవాడ పోలీసులు
  • సురక్షితంగా శిశువు.. రూ.1.75 లక్షల నగదు, కారు స్వాధీనం

మట్టెవాడ, మహా;

రోజురోజుకు మానవ సంబంధాలు డబ్బు తో ముడి పడుతున్నాయని మరోసారి రుజువైంది. ఆర్థిక ఇబ్బందులతో తమ కన్నబిడ్డనే విక్రయానికి దారి తీసిన ఘటన
వరంగల్‌ లో చోటుచేసుకుంది.
ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు
వారికి సహకరించిన కుటుంబ సభ్యులు, కొనుగోలుదారులుమధ్యవర్తుల తో కలిసి నాలుగు నెలల పసికందును రూ.2.90 లక్షలకు విక్రయించిన ఘటన వరంగల్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం పై మట్టెవాడ పోలీసులు, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ప్రతినిధులతో కలిసి దర్యాప్తు చేపట్టి అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది నిందితులను అరెస్టు చేసి, చిన్నారిని సురక్షితంగా రక్షించారు.

*ఆడపిల్లే కావడమే కారణమా?*

హనుమకొండ సమ్మయ్యనగర్‌ కు చెందిన గుగులోత్ సుమన్, అఖిల దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగు నెలల క్రితం మూడో సంతానంగా మరో ఆడపిల్ల జన్మించింది. సుమన్ మద్యానికి బాని సై పనులకు వెళ్లకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ముగ్గురు ఆడపిల్లలను పోషించడం భారంగా భావించిన దంపతులు.. సుమన్ తల్లి అమ్మి, తండ్రి బిక్షపతి తో కలిసి చిన్నారిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

*మధ్యవర్తుల ద్వారా బేరసారాలు*

ఈ క్రమంలో పులిచేరు సాంబయ్య, గుగులోత్ నీలా, జంజర్ల స్వామి అనే మధ్యవర్తులను సంప్రదించారు. స్వామి తన చిన్నమ్మ కడారి పుష్ప ద్వారా పిల్లలు లేని ఆలకుంట్ల ఐలమల్లు, ఆమె సోదరుడు మిరియాల రాజును సంప్రదించాడు. రాజు తన స్నేహితుడు, దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌కు చెందిన క్యాతం దేవేందర్‌ కు పిల్లలు లేరని తెలుసుకుని పాపను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చాడు. రూ.2.90 లక్షలకు బేరం ఖరారు చేశారు.

*ఎంజీఎం వద్ద పాప అప్పగింత*

ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మొదటి గేటు వద్దకు పసికందును తీసుకొచ్చారు. మైదం సుగుణ ద్వారా కారులో ఉన్న రాజు, ఐలమల్లు, పుష్పలకు అప్పగించారు. అక్కడ రాజు నుంచి సాంబయ్య రూ.1.90 లక్షలు తీసుకుని, అందులో రూ.లక్షను చిన్నారి నాయనమ్మ అమ్మికి ఇచ్చాడు. మిగిలిన రూ.90 వేలను సాంబయ్య, నీలా, స్వామి తలా రూ.30 వేల చొప్పున పంచుకున్నారు. అమ్మి తన వాటా నుంచి సుగుణకు రూ.2 వేలు ఇచ్చింది.

అనంతరం రాజు చిన్నారిని దేవేందర్‌కు అప్పగించాడు. గతంలో రాజు తీసుకున్న రూ.లక్ష అప్పును మినహాయించి మిగిలిన రూ.1.90 లక్షలను దేవేందర్ చెల్లించాడు. మార్గమధ్యంలో రాజు పుష్పకు రూ.9 వేలు ఇచ్చాడు. కాగా, పాప ఎక్కడికి వెళ్లిందని బంధువులు ప్రశ్నించగా.. ఎంజీఎం వద్ద గుర్తుతెలియని మహిళ రూ.20 ఇచ్చి చిన్నారిని తీసుకెళ్లిందని నమ్మించే ప్రయత్నం చేశారు.

*48 గుంటల్లో కేసును ఛేదించిన పోలీసులు*

ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో మట్టెవాడ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్‌ఐ బి.శ్రీనివాస్ సిబ్బంది తో కలిసి చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధుల సమక్షంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 24న రాత్రి సమ్మయ్యనగర్‌ లోని అమ్మి ఇంటి వద్ద ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. స్వామి ఇచ్చిన సమాచారంతో 25న తెల్లవారు జామున 1.30 గంటలకు దేశాయిపేటలోని లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌లో దేవేందర్ ఇంటి పై దాడి చేశారు. అక్కడ ఉన్న దేవేందర్, రాజు, ఐలమల్లు, పుష్పలను అదుపులోకి తీసుకుని పసికందును సురక్షితంగా రక్షించారు. మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*నగదు, కారు స్వాధీనం*

నిందితుల నుంచి మొత్తం రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అమ్మి వద్ద రూ.98 వేలు, సాంబయ్య వద్ద రూ.25 వేలు, నీలా వద్ద రూ.30 వేలు, స్వామి వద్ద రూ.17 వేలు, పుష్ప వద్ద రూ.5 వేలు లభించాయి. ఈ వ్యవహారంలో వినియోగించిన తెలుపు రంగు మారుతి సుజుకి ఎర్టిగా కారును (టీఎస్- 25-G-0997) కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*అక్రమ దత్తతకు పాల్పడవద్దు*

పిల్లలను విక్రయించడం, కొనుగోలు చేయడం, ఇందుకు మధ్యవర్తిత్వం వహించడం చట్టరీత్యా నేరామని పోలీసులు హెచ్చరించారు. పిల్లలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు జిల్లా శిశు సంక్షేమ కమిటీ లేదా గుర్తింపు పొందిన శిశు గృహాలను సంప్రదించాలని సూచించారు. శిశువుల విక్రయాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై డయల్ 100, 112 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు.
పిల్లలు లేని దంపతులు దళారులను ఆశ్రయించి అక్రమంగా పిల్లలను కొనుగోలు చేయకుండా, కేంద్ర ప్రభుత్వ కార ద్వారా కేరింగ్స్ పోర్టల్‌ లో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని సూచించారు.

*పోలీసు సిబ్బందికి అభినందనలు*

కేసు నమోదైన 48 గంటల్లోనే నిందితులను గుర్తించి, పసికందును సురక్షితంగా రక్షించిన మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ ఎన్.కరుణాకర్, ఎస్‌ఐ బి.శ్రీనివాస్‌ తో పాటు హెడ్ కానిస్టేబుల్ ఆర్.రమేష్, కానిస్టేబుళ్లు పి.శరత్, డి.దేవేందర్, ఎం.డి.అలీ, ఎ.రాజశేఖర్, ఎన్.నరేష్, కె.హరికాంత్, మహిళా కానిస్టేబుళ్లు కె.ఉమాదేవి, సి.హెచ్.సుమలత, ఎల్.మౌనిక, వి.అనుషలను సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ప్రత్యేకంగా అభినందించారు.