హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఏపీలో పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి వర్షాలతో పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమందని.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. అయితే, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
అల్పపీడన ప్రభావం కారణంగా రాబోయే నాలుగు రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. బలమైన గాలుల సమయంలో చెట్ల కింద ఉండవద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఆర్ టీ జీ ఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.
ఏపీలో వర్షం కురిసే జిల్లాలు:
మన్యం, అల్లూరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో సైతం అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాలోని రెండు రోజులు.. బుధవారం, గురువారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే, తెలంగాణలో చలి తీవ్రత సైతం పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గుతాయని పేర్కొంది.








