ఉగాది తర్వాత ఏపీలో నా పాదయాత్ర!
* పార్టీ నాదే.. సీఎం అభ్యర్థిని మాత్రం కాదు.
* గ్రామగ్రామాన పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటా.
* సామాజిక న్యాయమే ప్రాధాన్యం.
* రాజకీయాల్లోకి జెన్ జీ రావాలి.
* పీఆర్పీ అధినేత విజయసాయిరెడ్డి
ఢిల్లీ, మహా:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అధినేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటానని తెలిపారు. ప్రజల కష్టాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, స్థానిక అవసరాలను అధ్యయనం చేసి పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీకి యువతే ప్రధాన బలమని పేర్కొన్నారు. పార్టీ తనదే అయినప్పటికీ తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. పార్టీ అధినేతగా ఉంటూనే రాజకీయ సలహాదారుడి పాత్ర పోషిస్తానని, శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే తరహాలో పార్టీకి మార్గనిర్దేశం చేస్తానని వెల్లడించారు.
సామాజిక న్యాయమే పార్టీ విధానం
పరివర్తన రాజనీతి పార్టీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. రాజకీయాల్లో కొందరికే అవకాశాలు పరిమితం కాకుండా అన్ని సామాజిక వర్గాల నుంచి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. యువతకు, మహిళలకు రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు.
రాజకీయాల్లోకి జెన్ జీ రావాలి
ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కొత్త తరం యువత చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జెన్ జీ యువత రాజకీయాల్లోకి రావాలని, కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా చట్టాలు రూపొందించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. యువతలో ఉన్న ఆలోచనా శక్తి, నూతన దృక్పథం, సాంకేతిక పరిజ్ఞానం పాలనలో మార్పులకు దోహదపడతాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయడంతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో 66 శాతం టికెట్లు యువతకు కేటాయించాలన్న లక్ష్యాన్ని కూడా ప్రకటించారు.
రాష్ట్రంలో దశాబ్దాలుగా రెండు రాజకీయ కుటుంబాల చుట్టూనే అధికారం కేంద్రీకృతమైందని విమర్శించిన ఆయన, ప్రజలకు మరో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా, సామాజిక న్యాయం, యువ నాయకత్వం, పారదర్శకత లక్ష్యాలుగా తమ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఉగాది తర్వాత ప్రారంభించనున్న పాదయాత్రతో ప్రజలకు మరింత చేరువ కావాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.







