Mahaa Daily Exclusive

  పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండ!

Share

పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండ!
* అనుమతులకు సింగిల్ విండో.
* 48 గంటల్లో ఫీడ్‌పై నిర్ణయం.
* భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్‌కు భూకేటాయింపు.
* సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మహా:

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరలోనే సమగ్ర విధానం రూపొందించి సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు ఎదురవుతున్న అనుమతులు, భూమి మార్పిడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు సమగ్ర ప్రతిపాదనలతో ముందుకు వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఈక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, పరికరాలు, ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను వివరించడంతోపాటు పౌల్ట్రీ రంగానికి పలు హామీలు ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాలకూ సింగిల్ విండో విధానం

పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో ఫారాల ఏర్పాటుకు అనుమతులు పొందడం, భూమి వినియోగ మార్పిడి వంటి అంశాల్లో తీవ్ర జాప్యం ఎదురవుతోందని తన దృష్టికి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. పట్టణ ప్రాంతాల్లో బిల్డ్‌నౌ యాప్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్న తరహాలోనే గ్రామీణ ప్రాంతాలకూ ఈ విధానాన్ని విస్తరిస్తామని చెప్పారు. పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమైన అన్ని అనుమతులు నిర్ణీత సమయంలో లభించేలా సమగ్ర పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. ఐటీ, ఫార్మా, రక్షణ రంగాలతోపాటు పౌల్ట్రీ పరిశ్రమను కూడా ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తోందని తెలిపారు.

ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్

డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు తగిన ప్రతిపాదనలతో ముందుకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో పౌల్ట్రీ రంగానికి సంబంధించిన ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించుకునేలా శాశ్వత వేదిక ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు.

మొక్కజొన్న, సోయాబీన్‌పై 48 గంటల్లో నిర్ణయం

పౌల్ట్రీ పరిశ్రమకు అత్యంత కీలకమైన కోళ్ల దాణా ధరలు, ముడిసరుకుల లభ్యతపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా స్పందించారు. పౌల్ట్రీ రంగం ఎల్లప్పుడూ ఒకే విధంగా లాభాలు ఆర్జించలేదని, కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఒడిదొడుకులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, దాణా కొరత వంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ముడిసరుకుల విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ప్రస్తావించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న బఫర్ స్టాక్‌ను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న, సోయాబీన్‌ను బహిరంగ మార్కెట్‌లో విక్రయించడంతోపాటు అవసరమైన మేరకు పౌల్ట్రీ పరిశ్రమకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది? పరిశ్రమకు ఏ మేరకు అందించవచ్చు? ఏ ధరకు సరఫరా చేయవచ్చు? అనే అంశాలను వ్యవసాయ శాఖ మంత్రితో కలిసి సమీక్షించి 48 గంటల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని వేదికపైనే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. ఈ ప్రకటన పౌల్ట్రీ రంగ ప్రతినిధుల్లో ఆశలు రేకెత్తించింది.

రైతులకు పౌల్ట్రీ పరిశ్రమ వెన్నుదన్ను

పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లు, గుడ్ల ఉత్పత్తికే పరిమితం కాదని, వ్యవసాయ రంగంతో విడదీయలేని అనుబంధం కలిగి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతులు పండించే మొక్కజొన్న, సోయాబీన్‌తోపాటు నూకలు, తౌడు వంటి ఉప ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా పౌల్ట్రీ రంగం రైతులకు మార్కెట్ కల్పిస్తోందని ప్రశంసించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రైతులు, రైతు కూలీలు, రవాణా రంగం, దాణా తయారీ సంస్థలు, చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమగా అభివర్ణించారు.

తెలంగాణలో ప్రతిరోజూ సుమారు 5.30 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. యువతకు అవసరమైన ప్రొటీన్లను అందించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో మూడు గుడ్లు, చికెన్‌తో కూడిన పౌష్టికాహారం అందించడంలోనూ ఈ పరిశ్రమ సహకారం ఉపయోగపడుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, పోషకాహార భద్రతలో పౌల్ట్రీ రంగం భాగస్వామ్యం అభినందనీయమన్నారు.

పెట్టుబడులకు భరోసా.. విధానాల్లో స్థిరత్వం

తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన మంచి పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూనే, వాటిని మరింత మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతున్నాయని, దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల భద్రతపై ఆందోళన చెందాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాత్రం పరిశ్రమలకు విధానపరమైన స్థిరత్వం, పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఐటీ, ఫార్మా, డిఫెన్స్ పరిశ్రమలతోపాటు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, పౌల్ట్రీ రంగాలకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ జీడీపీ వాటా 10 శాతానికి పెంచడమే లక్ష్యం

దేశ జనాభాలో తెలంగాణ వాటా సుమారు 2.5 శాతమే అయినప్పటికీ, దేశ స్థూల దేశీయోత్పత్తిలో రాష్ట్రం ప్రస్తుతం 5 శాతం వాటాను అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ వాటాను 10 శాతానికి పెంచడమే తమ లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే పారిశ్రామిక రంగం మరింత బలోపేతం కావాలని, పెట్టుబడులు పెరగాలని పేర్కొన్నారు.

పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు గత 18 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో పౌల్ట్రీ, మీట్ ఎక్స్‌పోను విజయవంతంగా నిర్వహించడం, ఉత్పత్తి సామర్థ్యంలో సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పౌల్ట్రీ రంగం మరింత కీలక పాత్ర పోషించేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, శాసనసభ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఐపీఈఎంఏ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్‌తోపాటు పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Latest