Mahaa Daily Exclusive

  కోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై ఏపీ హైకోర్టు ఆంక్షలు.

Share

కోర్టు విచారణల రికార్డింగ్‌, ప్రసారంపై ఏపీ హైకోర్టు ఆంక్షలు.
* అనుమతి లేకుండా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయరాదు.
* వీడియోలు, ఆడియోలు, స్క్రీన్‌షాట్ల ప్రచురణపైనా నిషేధం.

అమరావతి, మహా:

కోర్టు విచారణల గౌరవం, గోప్యతను కాపాడే దిశగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానంలో జరిగే విచారణలను అనుమతి లేకుండా రికార్డు చేయడం, వాటిని ప్రసారం చేయడంపై ఆంక్షలు విధించింది. కోర్టు అనుమతి లేకుండా విచారణల ప్రత్యక్ష ప్రసారం (లైవ్‌ స్ట్రీమింగ్‌) చేయరాదని స్పష్టం చేసింది.

ముందస్తు అనుమతి లేకుండా భౌతిక విచారణలతోపాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే విచారణలను కూడా రికార్డు చేయరాదని ఆదేశాల్లో పేర్కొంది. వీడియోలు, ఆడియోలు చిత్రీకరించడం, ఫొటోలు తీయడం, స్క్రీన్‌షాట్లు తీసుకోవడం నిషేధమని స్పష్టం చేసింది. న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు, కోర్టు సిబ్బంది సహా ఎవరూ ఈ నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించింది.

కోర్టు విచారణలకు సంబంధించిన దృశ్యాలు, రికార్డింగులను టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్‌ యాప్‌లు లేదా ఇతర డిజిటల్‌ వేదికల ద్వారా అనధికారికంగా ప్రసారం చేయడం, అప్‌లోడ్‌ చేయడం, పంచుకోవడం కూడా నిషేధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. న్యాయస్థాన గౌరవం, పవిత్రత, విచారణల క్రమబద్ధ నిర్వహణ, న్యాయపాలన పరిరక్షణ కోసమే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు హైకోర్టు వెల్లడించింది.