Mahaa Daily Exclusive

  హసీనా తిరుగు ప్రయాణంపై భారత్ కీలక ప్రకటన…

Share

హసీనా తిరుగు ప్రయాణంపై భారత్ కీలక ప్రకటన.
• అప్పగింత అభ్యర్థన, స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లడం వేర్వేరు అంశాలు.
• డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వెళ్లాలన్న హసీనా ఆకాంక్షపై స్పందన

న్యూఢిల్లీ, మహా:

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లే అంశంపై భారత్ కీలక ప్రకటన చేసింది. ఆమె స్వచ్ఛందంగా బంగ్లాదేశ్‌కు వెళ్లాలనుకోవడం, ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అధికారిక అభ్యర్థన రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది. అప్పగింత అభ్యర్థనను నిర్దేశిత విధానాల ప్రకారం పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

బుధవారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయంపై స్పందించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన భారత ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అవసరమైన ప్రయాణ పత్రాలతో ఏ పౌరుడైనా స్వచ్ఛందంగా తన దేశానికి తిరిగి వెళ్లాలనుకోవడం అప్పగింత ప్రక్రియకు భిన్నమైన అంశమని వివరించారు. డిసెంబర్ 16న హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై అంతకుమించి వ్యాఖ్యానించబోమని చెప్పారు.

2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టారు. అప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం సందర్భంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ వెల్లడించారు. ఢిల్లీ నుంచి ఢాకాకు బంగ్లాదేశ్‌ జాతీయ విమానయాన సంస్థ బిమాన్‌ విమానంలో తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు తెలిపారు. ప్రయాణ పత్రాల కోసం ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ను కూడా సంప్రదించినట్లు వెల్లడించారు.

మరోవైపు, 2024 ఉద్యమ సమయంలో జరిగిన అణచివేతకు సంబంధించి బంగ్లాదేశ్‌లోని న్యాయస్థానం గత ఏడాది హసీనాకు ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరుతోంది. ఈ నేపథ్యంలో హసీనా ప్రతిపాదిత స్వదేశీ పర్యటనపై భారత్ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, డిసెంబర్ 16న ఆమె తిరుగు ప్రయాణం ఖరారైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించలేదు.