Mahaa Daily Exclusive

  భారత్‌పై 25 శాతం వరకు అమెరికా సుంకాల ప్రతిపాదన…

Share

భారత్‌పై 25 శాతం వరకు అమెరికా సుంకాల ప్రతిపాదన.
• వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతానికి పరిమితం.
• చైనాపై 20 శాతం వరకు అదనపు సుంకాలు.
• 14 దేశాలపై ట్రంప్‌ ప్రభుత్వం కొత్త వాణిజ్య చర్యలు.
• ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం

వాషింగ్టన్‌, మహా:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరోసారి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. భారత్‌, చైనా సహా 14 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించేందుకు ప్రతిపాదనలు ప్రకటించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్‌) ఎనిమిది నెలల పాటు నిర్వహించిన విచారణ అనంతరం ఈ ప్రతిపాదనలను వెల్లడించింది. అయితే భారత్‌పై 17 శాతం సుంకం విధించనున్నారన్న ప్రచారానికి సంబంధించి కీలక స్పష్టత ఉంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితేనే సుంకాన్ని 17 శాతానికి పరిమితం చేసే అవకాశాన్ని ప్రతిపాదించారు. ఒప్పందం కుదరకపోతే భారత్‌ ఉత్పత్తులపై 25 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదన ఉంది.

యూఎస్‌టీఆర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం చైనాపై కొన్ని ఉత్పత్తులకు 20 శాతం వరకు అదనపు సుంకాలు విధించే ప్రతిపాదన ఉంది. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని సుంకాలు, నిర్దిష్ట ఉత్పత్తులకు మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలను రూపొందించారు. భారత్‌, చైనాతోపాటు యూరోపియన్‌ యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్‌, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, థాయ్‌లాండ్‌, తైవాన్‌లను ఈ ప్రతిపాదనల్లో చేర్చారు.

ఈ దేశాలు తమ పారిశ్రామిక రంగాలకు అధికంగా ప్రభుత్వ రాయితీలు అందించడం, మార్కెట్‌ అవసరాలకు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ అసమతుల్యత ఏర్పడుతోందని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. చౌక ధరలతో వస్తువులు అమెరికా మార్కెట్‌లోకి రావడం వల్ల అక్కడి తయారీ సంస్థలు, పరిశ్రమలు నష్టపోతున్నాయని పేర్కొంటోంది. దేశీయ పరిశ్రమలను రక్షించడం, వాణిజ్య లోటును తగ్గించడం ఈ చర్యల వెనుక ప్రధాన లక్ష్యాలుగా చెబుతోంది.

అయితే ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి రావడం లేదు. ప్రస్తుతం ఇవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమెరికా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రక్రియ కారణంగా అమలు వచ్చే ఏడాది జనవరి వరకు వాయిదా పడే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అన్ని ఉత్పత్తులపైనా ఒకే విధంగా సుంకాలు వర్తించవు. నిర్దిష్ట ఉత్పత్తులకు మాత్రమే ప్రతిపాదిత అదనపు సుంకాలు వర్తించనున్నాయి. ఇప్పటికే ఇతర చట్టాల కింద సుంకాలు అమల్లో ఉన్న కొన్ని ఉత్పత్తులకు మినహాయింపులు కూడా ప్రతిపాదించారు. తుది నిబంధనలు, వాణిజ్య ఒప్పందాలపై చర్చలు పూర్తయిన తర్వాతే భారత ఎగుమతులపై పడే ప్రభావం స్పష్టమవుతుంది.