Mahaa Daily Exclusive

  తిరుమల చరిత్రలోనే అరుదైన ఘట్టం..! తిరుమలేశుడికి 121 కిలోల స్వర్ణాభరణాల కానుక..!

Share

  •  తిరుమలేశుడికి 121 కిలోల స్వర్ణాభరణాల కానుక!
  •  రూ.160 కోట్ల విలువైన 46 రకాల ఆభరణాలు.
  •  చెన్నై పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ సమర్పణ.
  • సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి అందజేత.

తిరుమల, మహా:

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత వర్ధమాన్ జైన్ కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్వర్ణ కానుకను సమర్పించారు. దాదాపు రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారి కైంకర్యాల కోసం విరాళంగా అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అప్పగించారు. తిరుమల ఆలయ చరిత్రలో ఒక భక్తుడు వ్యక్తిగతంగా, ఒకేసారి ఇంత భారీ పరిమాణంలో స్వర్ణాభరణాలను సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

శిరస్సు నుంచి పాదాల వరకు.. 9 పెట్టెల్లో 46 రకాల ఆభరణాలు.

శ్రీవారి నిత్య అలంకరణ, విశేష ఉత్సవాలకు అనుగుణంగా స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు అలంకరించేలా సంప్రదాయ రీతిలో 46 రకాల ఆభరణాలను ప్రత్యేకంగా రూపొందించారు. కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, భుజకీర్తులు, కంఠాభరణాలు, పాదుకలు తదితర ఆభరణాలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ 9 ప్రత్యేక పెట్టెల్లో ఈ బంగారు ఆభరణాలను తిరుమలకు తీసుకొచ్చారు. వేకువజామున శ్రీవారికి నిర్వహించే అభిషేకం అనంతరం ఈ నూతన స్వర్ణాభరణాలతో స్వామివారిని అలంకరించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలం తర్వాత ఆధునిక యుగంలో ఒక భక్తుడు స్వామివారి సంపూర్ణ అలంకరణకు సరిపడా ఆభరణాలను సమర్పించడం ఆధ్యాత్మిక వర్గాల్లో విశేష చర్చనీయాంశమైంది.

వ్యాపారంలో విజయం.. మొక్కు తీర్చుకున్న దాత.

వ్యాపార రంగంలో ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే తిరుమలేశుడికి పాదాల నుంచి కిరీటం వరకు బంగారు ఆభరణాలు చేయిస్తానని వర్ధమాన్ జైన్ గతంలో మొక్కుకున్నారు. ఆయన స్థాపించిన ‘యాక్సెస్ హెల్త్‌కేర్’ సంస్థలో సుమారు 60 నుంచి 70 శాతం వాటాను 2025లో అమెరికాకు చెందిన ఒక సంస్థకు (సుమారు 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో) విక్రయించడంతో భారీ స్థాయిలో ఆర్థిక లాభాలు సమకూరాయి. శ్రీవారి అనుగ్రహంతోనే ఈ విజయం సాధ్యమైందన్న ప్రగాఢ విశ్వాసంతో, తాను మొక్కుకున్నట్లుగానే 121 కిలోల బంగారు ఆభరణాలను తయారు చేయించి స్వామివారి పాదాల చెంత ఉంచారు.

2019 నుంచి నిరంతర సేవ.. గతంలోనూ భారీ విరాళాలు.

వర్ధమాన్ జైన్ 2019 నుంచి టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు, భక్తుల సౌకర్యార్థం అనేక భారీ విరాళాలు అందిస్తూ వస్తున్నారు. ఎస్వీ భక్తి ఛానల్ (SVBC) సాంకేతిక, కార్యక్రమాల అభివృద్ధికి దశలవారీగా మొత్తం రూ.7 కోట్లు (2020లో రూ.2.10 కోట్లు, 2025 జనవరిలో రూ.5 కోట్లు) విరాళమిచ్చారు. టీటీడీ గోసంరక్షణ ట్రస్టుకు 2020లో రూ.1.11 కోట్లు, 2025 జనవరిలో రూ.1 కోటి నగదు విరాళంతో పాటు, తిరుమల గోశాలలో రూ.5 కోట్ల వ్యయంతో పశుగ్రాసం మిక్సింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు.
అంతేకాకుండా తిరుమలలో భక్తుల ఉచిత రవాణా కోసం విద్యుత్ బస్సులను విరాళంగా అందించడంతో పాటు, హుండీ కానుకల నాణేలను వేగంగా వేరు చేసి లెక్కించేందుకు రూ.1 కోటి విలువైన కాయిన్ సార్టింగ్ యంత్రాన్ని అందజేశారు. 2024 నవంబరులో ఎస్వీ అన్నప్రసాదం, ఎస్వీ ప్రసాదం ట్రస్టులకు రూ.1.01 కోట్ల చొప్పున రూ.2.02 కోట్లు సమర్పించారు. గతంలో చెన్నై టి.నగర్‌లోని టీటీడీ ఆలయ విస్తరణకు సైతం రూ.1.02 కోట్లు విరాళమిచ్చి తన భక్తిని చాటుకున్నారు.

ఎవరీ వర్ధమాన్ జైన్? కార్పొరేట్ దిగ్గజం నేపథ్యమిదీ.

సుమారు రూ.8,292 కోట్ల నికర ఆస్తులతో దేశంలోని ప్రముఖ సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో ఉన్న వర్ధమాన్ జైన్, హెల్త్‌కేర్ టెక్నాలజీ, ఐటీ, బీపీఓ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. చెన్నైలోని ప్రతిష్ఠాత్మక లయోలా కళాశాలలో స్టాటిస్టిక్స్‌లో పట్టభద్రుడైన ఆయన, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో పెరోట్ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ సంస్థ డెల్ సర్వీసెస్‌లో విలీనమవడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ‘యాక్సెస్ హెల్త్‌కేర్’ సంస్థను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారు. విజన్ హెల్త్‌సోర్స్ సహ వ్యవస్థాపకుడిగా, ఏషియా ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా, ‘చెన్నై ఏంజెల్స్’ సభ్యుడిగా పలు స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా రాణిస్తున్న ఆయన, మెడికల్ కోడింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ విభాగాల్లో పేటెంట్లు కూడా సాధించారు.
వ్యాపార రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ సామాజిక సేవకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. చెన్నైలోని కాంచీ కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీగా సేవలందిస్తూనే, ‘శ్రీ సరితా జైన్ ఫౌండేషన్’ ద్వారా పేదలకు విద్య, వైద్య సాయం అందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ‘ఆవిష్కార్’ సంస్థను నిర్వహిస్తూ ఎందరికో ఉపాధి బాటలు వేస్తున్నారు. ఇప్పుడు తిరుమల శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాలను సమర్పించడం ద్వారా భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు.