Mahaa Daily Exclusive

  పార్లమెంటుకు మళ్లీ ఎన్నికల వేడి..! నవంబరు 30 నుంచి ప్రత్యేక సమావేశాలు..

Share

  • డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లపై ఉత్కంఠ.
  •  ఏప్రిల్‌లో వీగిన రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ తెరపైకి తెస్తారా?

న్యూఢిల్లీ, మహా:

పార్లమెంటు ఉభయ సభలను మరోసారి సమావేశపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం నవంబరు 30 నుంచి పార్లమెంటు సమావేశాలను తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. నవంబరు 30న లోక్‌సభ, డిసెంబరు 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలను బట్టి డిసెంబరు 3న సమావేశాలు ముగిసే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌లను ప్రభుత్వం కోరినట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లపై చర్చ

కేంద్రం తాజా సమావేశాల ఎజెండాను అధికారికంగా వెల్లడించనప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలుకు మార్గం సుగమం చేయడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజనలో మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్వల్ప వ్యవధిలో పార్లమెంటును తిరిగి సమావేశపరచడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏప్రిల్‌లో వీగిన రాజ్యాంగ సవరణ బిల్లు

2026 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు అత్యంత కీలకమైనది. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏప్రిల్‌ 17న లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లు వీగిపోయింది. దీంతో దానికి అనుబంధంగా ఉన్న డీలిమిటేషన్‌ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు.

లోక్‌సభ స్థానాల పెంపుపై ప్రతిపాదనలు

ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలున్నాయి. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచే అంశాన్ని పొందుపరిచారు. రాష్ట్రాలకు గరిష్ఠంగా 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాల వరకు కేటాయించే ప్రతిపాదన ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాష్ట్రాల వారీగా స్థానాల సంఖ్యలో మార్పులు తీసుకురావడం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ఈ ప్రతిపాదనల్లో కీలక అంశాలు. అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

100 రోజులకు పైగా ముగియని వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే వాటిని అధికారికంగా ప్రొరోగ్‌ చేయకపోవడం గమనార్హం. సాధారణంగా సభలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం సమావేశాల ముగింపునకు సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తవుతుంది. కానీ ఈసారి 100 రోజులకు పైగా గడిచినా ఆ ప్రక్రియ జరగలేదు. దీంతో అవసరమైనప్పుడు పార్లమెంటును స్వల్ప వ్యవధిలో తిరిగి సమావేశపరిచేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం కూడా తాజా సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

ఎంపీలకు విప్‌లు జారీ చేసే అవకాశం

తాజా సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎంపీలకు విప్‌లు జారీ చేసే అవకాశముంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ వంటి కీలక అంశాలు చర్చకు వస్తే పార్లమెంటులో రాజకీయ వాతావరణం వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మద్దతును కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, రాష్ట్రాల మధ్య సమాన ప్రాతినిధ్యం, జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.

అయితే నవంబరు 30, డిసెంబరు 2 తేదీల్లో సభలను తిరిగి సమావేశపరచాలని ప్రభుత్వం కోరినట్లు మాత్రమే మంత్రి కిరణ్‌ రిజిజు అధికారికంగా ప్రకటించారు. ఏయే బిల్లులను ప్రవేశపెడతారనే విషయాన్ని వెల్లడించలేదు. డిసెంబరు 3 వరకు కొనసాగే అవకాశమున్న ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏప్రిల్‌లో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ ప్రవేశపెడుతుందా? మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Latest