- ఆధార్, పాన్ కార్డులతో రూ.70 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు.
ఒక్క ఖాతాలోనే రెండేళ్లలో రూ.8.55 కోట్ల జమ. - సోదరుడు సంజీవ్ మిట్టల్కూ రిమాండ్.
- ఆదిలాబాద్ వ్యాపార వర్గాల్లో కలకలం.
ఆదిలాబాద్ ,మహా.
తమ వద్ద పనిచేసే సామాన్య కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి ఆధార్, పాన్ కార్డులతో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచి రూ.70 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు సాగించిన భారీ ఆర్థిక మోసం ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్ మిట్టల్ (స్థానికంగా ‘గోరా సేఠ్’గా పరిచితుడు) తో పాటు ఆయన సోదరుడు, మరో వ్యాపారి సంజీవ్ కుమార్ మిట్టల్‌ను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతూ సాగించిన ఈ చీకటి దందా వెలుగులోకి రావడం జిల్లా వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆదిలాబాద్ పట్టణ కేంద్రంగా రియల్ ఎస్టేట్, సోయా, పత్తి జిన్నింగ్ తదితర భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్న రాజీవ్ మిట్టల్, తన సంస్థల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేటు సిబ్బంది వద్ద నుంచి వివిధ కారణాలు చెప్పి వ్యక్తిగత గుర్తింపు పత్రాలను సేకరించారు. ఆ పత్రాల ఆధారంగా కార్మికులకు తెలియకుండానే వారి పేర్లతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. తమ వ్యాపారాలకు సంబంధించిన కోట్లాది రూపాయల నగదును ఈ బినామీ ఖాతాల ద్వారా మళ్లిస్తూ ఆదాయపు పన్ను (ఐటీ), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఎగవేతకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో అనూహ్యంగా కోట్లాది రూపాయల నగదు జమ కావడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ భారీ లావాదేవీలపై వివరణ కోరుతూ సంబంధిత ఖాతాదారులకు నోటీసులు జారీ చేశారు. వాటికి సరైన సమాధానాలు రాకపోవడంతో ఆయా ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. తమ పేర్లపై ఉన్న బ్యాంకు ఖాతాలు నిలిచిపోవడంతో అనుమానం వచ్చిన కార్మికులు ఆరా తీయగా అసలు బాగోతం బయటపడింది.
రాజీవ్ మిట్టల్ వద్ద గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న పెరిక భూమన్న అనే కార్మికుడు, మరో నలుగురు సిబ్బందితో కలిసి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దందా గుట్టురట్టయింది. భూమన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించి విస్తుపోయారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఆ ఒక్క ఖాతాలో రూ.8.55 కోట్ల నగదు జమ అయినట్లు తేలింది. ఇదే తరహాలో మరికొందరు కార్మికుల ఖాతాలను పరిశీలించగా, మొత్తం రూ.70 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ జీవన్‌రెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం లోతైన దర్యాప్తు చేపట్టింది. ఫోర్జరీ, నమ్మకద్రోహం, మోసం, అక్రమ ఆర్థిక లావాదేవీలు, పన్నుల ఎగవేత తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రాజీవ్ మిట్టల్, సంజీవ్ మిట్టల్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. ఈ బినామీ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది, అసలు లబ్ధిదారులు ఎవరు, జిల్లాలో ఇంకెంత మంది అమాయక కార్మికుల పేర్లను ఇలా దుర్వినియోగం చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను, జీఎస్టీ శాఖల అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.








