Mahaa Daily Exclusive

  ప్రజాస్వామ్యంలో నవశకం. మహిళా రిజర్వేషన్లు చారిత్రాత్మక సంస్కరణ.! మోదీ, అమిత్ షాలపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశంసలు.

Share

  • ప్రజాస్వామ్యంలో నవశకం.
  • మహిళా రిజర్వేషన్లు చారిత్రాత్మక సంస్కరణ.
  • దక్షిణాది ప్రయోజనాలకు రక్షణ.
  • మోదీ, అమిత్ షాలపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశంసలు.

హైదరాబాద్, మహా.

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు భారత ప్రజాస్వామ్యంలో నవశకానికి నాంది పలుకుతాయని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలకు రాజకీయ సాధికారత కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అచంచల సంకల్పానికి ఈ సంస్కరణలు నిదర్శనమని కొనియాడారు.
నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం చట్టసభల్లో స్థానాల సంఖ్యను పెంచే ప్రక్రియ మాత్రమే కాదని, మారుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించి ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే చారిత్రాత్మక సంస్కరణ అని సుధాకర్ రెడ్డి అభివర్ణించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాలను సమాన నిష్పత్తిలో 50 శాతం పెంచాలన్న ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళా సాధికారతతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమన్న దృఢ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని, మహిళలను కేవలం అభివృద్ధి ఫలాలు అందుకునే స్థాయి నుంచి దేశ పాలనలో భాగస్వాములుగా, నిర్ణయాధికారులుగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దశాబ్దాలుగా కేవలం చర్చలకే పరిమితమైన మహిళా రాజకీయ సాధికారతను ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా మోదీ ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువచ్చిందని, ఇందుకు ప్రధాని చూపుతున్న రాజకీయ సంకల్పం, హోంమంత్రి అమిత్ షా అందిస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం అభినందనీయమని ప్రశంసించారు.
మహిళా సాధికారత, ప్రజాస్వామ్య పరిపుష్టి వంటి కీలక అంశాల్లో రాజకీయ విభేదాలకు తావుండకూడదని, దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు ఈ సంస్కరణలకు నిర్మాణాత్మక సహకారం అందించాలని సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపడుతున్న ఈ చారిత్రాత్మక సంస్కరణలు భవిష్యత్ తరాలకు సుస్థిరమైన ప్రజాస్వామ్య పునాదులను అందించడమే కాకుండా, ‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest