గత ఏడాది (2023) కంటే ప్రస్తుత ఏడాది (2024) లో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలీస్తే ఈసారి క్రైం రేటు 9.87 శాతం పెరిగిందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, సిబ్బంది సంక్షేమం కోసం చేపట్టిన చర్యలు, నేర నివారణ కోసం పోలీసులు తీసుకున్న చర్యలు, ప్రభుత్వ సహకారం తదితర అంశాలపై మాట్లాడారు. 2025 డ్రగ్స్ రహిత తెలంగాణే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ తెలిపారు. ప్రస్తుత ఏడాదిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను సీజ్ చేశామని.. ఇప్పటివరకు 4682 మంది నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైం కేసులు నమోదు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో రూ. 180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించామన్నారు. 703 దొంగతనం కేసుల్, 58 దోపిడీ, 1525 కిడ్నాప్, 856 హత్య, 2945 లైంగిక దాడుల కేసులు నమోదు చేశామని చెప్పుకొచ్చారు. డయల్ 100కు ఏకంగా 16,92,173 కంప్లైంట్స్ వచ్చాయని డీజీపీ పేర్కొన్నారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపిన డీజీపీ డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేసినట్టు తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360 కేసులు, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదైనట్టు వివరించారు. ఈ ఏడాది మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 4.7 శాతం పెరిగాయని వివరించారు. అత్యాచార కేసులలో శాతం తెలిసిన వారి ప్రమేయం ఉందన్నారు. ద్విచక్ర వాహనాల చోరీ కేసులు కూడా ఈ ఏడాది పెరిగాయని తెలిపారు. స్పెషల్ నార్కొటిక్ బృందం డ్రగ్స్ నివారణకు చురుగ్గా పని చేస్తోందని, ఈ ఏడాది 150 గంజాయి కేసులు నమోదవగా, రూ. 142 కోట్ల విలువ చేసే 20 టన్నుల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా గట్టి చర్య.లు తీసుకున్నామని వెల్లడించారు. 48 డ్రగ్స్ కేసుల్లో శిక్ష పడిందన్నారు. ఎన్డీపీఎస్ కేసులలో రూ. 2.42 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని సీజ్ చేశామన్నారు. రూ. 180 కోట్ల నగదును బాధితులకు అందించామని వెల్లడించారు.
పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనపై స్పందిస్తూ చట్టవిరుద్దమైన ప్రైవేట్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశామన్నారు. సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారని.. ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి సంబంధం ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. సైబర్ నేరాల్లో ఒక్కోసారి నిపుణులైన పోలీసుల కొరత ఉందని, కొన్ని కేసుల్లో సాంకేతిక అంశాలను గుర్తించేందుకు ప్రైవేట్ వ్యక్తుల సేవలను వినియోగించుకుంటున్నారన్న ప్రశ్నలు డీజీపీ ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నామని, 2024లో కొంత మేర రోడ్డు ప్రమాదాలు తగ్గాయని డీజీపీ చెప్పారు. నేరాల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు కారణాలేమిటన్న ప్రశ్నకు స్పందిస్తూ ప్రత్యేక కారణం ఏమీ లేదన్నారు.
సిబ్బందికి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం
ఇటీవల జరుగుతున్న పోలీసులు వరుస ఆత్మహత్యలపై కూడా డీజీపీ స్పందిస్తూ ఆత్మహత్యలు ప్రతి ఏడాది చోటుచేసుకుంటున్నాయని.. ఈ సంవత్సరం మాత్రమే కొత్త కాదని చెప్పుకొచ్చారు.
ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో పాటు మరో యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారగా ఆదివారం (డిసెంబర్ 29న) ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఆత్మహత్య చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. పోలీసుల వరుస ఆత్మహత్యల ఘటనలు ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో డీజీపీ స్పందించారు. ఈ ఏడాది మాత్రమే కాదని.. ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో పోలీసులు సూసైడ్ మరణాలు చోటు చేసుకుంటున్నాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ అభిప్రాయపడ్డారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్య లు చేసుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులకు నిపుణులతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు.







