ఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు శనివారం కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కేజ్రీవాల్, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలపై కేజ్రీవాల్ స్పందించారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. రెండు పార్టీలూ కావాలనే కూటమిగా ఏర్పడి తమపై దాడి చేస్తున్నాయంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. తన నివాసం వద్ద ఆందోళన చేసిన మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు కాదన్నారు. వారంతా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పంజాబ్ ప్రజల మద్దతు తమకే ఉందన్నారు.






