Mahaa Daily Exclusive

  పట్టు కోసం ప్రయత్నాలు బీజేపీలో అగ్రనేతల మధ్య పోటీ

Share

పట్టు కోసం ప్రయత్నాలు

బీజేపీలో అగ్రనేతల మధ్య పోటీ

తనకు దక్కనిది ఇతరులకు దక్కొద్దన్న ఆరాటం

అధిష్టానం నిర్ణయంపైనే మంత్రుల పలుకుబడి తేలేది

హైదరాబాద్, మహా : రాష్ట్ర బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కాక రేపుతోంది. ఎందరో ఆశావహులు.. ఇంకెన్నో ఊహాగానాలు మధ్య స్టేట్‌ ప్రెసిడెంట్ ఎంపిక క్లైమాక్స్‌కు చేరుకుంది. దీంతో కమలం పార్టీలో అసక్తికరంగా మారింది ఆదిపత్యపోరు. అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న ఆలోచనలో ఉన్న అధిషఅటానం ఇప్పటికే కొంత వడపోతను పూర్తి చేసింది. వడపోతలో మిగిలిన నేతలలో కొంత మంది పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో కొందరు పార్టీని అంటి పెట్టుకున్న వారైతే మరికొందరు మాస్ లీడర్లు ఉన్నారు. వాళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో అగ్రనేత సపోర్ట్ చేస్తుండటంతో రాష్ట్ర కాషాయాధిపతి ఎవరవుతారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పదవికి కావాల్సిన అర్హతలన్నీ నాకు ఉన్నాయి, ఇస్తే నాకు ఇవ్వండి లేకపోతే నేను సూచించిన నేతకు కట్టబెట్టండి అంటూ కొంత మంది అధిష్టానం వద్ద ప్రతిపాదనలను ఉంచుతున్నారు. దీంతో ఎంపిక ప్రక్రి. కొంత కష్టంగా మారిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిమాజాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, రామచంద్రా రెడ్డిలు అధయక్ష పదవి రేసులో ఉన్నారు. ఆశావహులు ఇప్పటికే అధినాయకత్వానికి తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. ఇప్పుడు వారి తరుఫున అగ్రనేతలు కూడా రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కేంద్రమంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు వారి వారి అనుచరుల పేర్లు తెరపైకి తెచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. రేసులో చాలామంది ఉన్నప్పటికీ ఆర్ఎస్‌ఎస్‌కు దగ్గరగా ఉన్న నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రపోజల్‌ పెట్టారట ఈ ఇద్దరు మంత్రులు. చింతల రాంచంద్రారెడ్డి, రామచందర్ఎ రావులలో ఒకరికి ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరుతుండగా, రాంచందర్ రావు, మనోహర్ రెడ్డిలలో ఒకరిని అధ్యక్షుడిని చేయాలని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ నాయకత్వానికి సూచించారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు ముఖ్యనేతలు సూచనలు, సలహాల దగ్గరే ఆగకుండా తమ వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నేతలంతా బయటకు బానే కనిపిస్తున్నప్పటికీ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నట్లే కనబడుతున్నా లోలోపల ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారని కమలం పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తారని చర్చించుకుంటున్నారు. తాను ప్రపోజ్ చేసిన వారికే అధ్యక్ష బాధ్యతలు ఇస్తే రాష్ట్ర పార్టీలో పట్టు సాధించ్చవచ్చనే యోచనలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే అధికారికంగా అధ్యక్షుడిని ప్రకటిస్తే ఈ ఇద్దరి నేతల్లో అధిష్టానం దగ్గర ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉందో స్పష్టవుతుందని అంటున్నారు. అయితే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సూచించిన నేతలకు అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయా లేక ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లుగా పేరున్న నేతల్లో ఎవరో ఒకరు స్టేట్‌ ప్రెసిడెంట్ కాబోతున్నారా అనేది సంక్రాంతి తర్వాత తేలనుంది.

Latest