రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా “మీ టికెట్” యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా వివిధ రకాల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ, మెట్రో, ఆలయ దర్శనం, జూ పార్కులు, బోటింగ్, మ్యూజియంలు, వినోదం టిక్కెట్లు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ఈఎస్డీ) రూపొందించిన అధునాతన ‘మీ టికెట్’ యాప్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ పార్క్, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.







