Mahaa Daily Exclusive

  అంతకు మించి రేవంత్ టార్గెట్ ఫిక్స్ …!

Share

దావోస్ లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో పెట్టుబడుల సమీకరణలో దూసుకెళ్తున్నారు. గత ఏడాది దావోస్‌ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు. అందుకనుగుణంగానే పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, తయారీ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోపాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాదికి మించి పెట్టుబడుల సాధనకు చర్చలు జరుగుతున్నాయి. దావోస్ కు ముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఎపి సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ వైపు గత ఏడాదికి మించి, మరోవైపు పక్కనున్న ఎపిని మించి సాధించాలన్న రెండు బెంచ్ మార్క్ లు ముఖ్యమంత్రి రేవంత్ ముందున్నాయి. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు, హైదరాబాద్ అనుకూలతలు, సీఎం ప్రకటించిన ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్శిటీ వంటి ఆకర్షణలు భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడే అవకాశాలున్నాయి. సీఎం టీమ్ లో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.