Mahaa Daily Exclusive

  ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయ్…!

Share

ఎటైనా వెళ్లాలంటే ఆటోలు, కార్లు, బైక్ లను బుక్ చేసుకుని రైయ్ రైయ్ మని వెళ్లిపోతుంటారు. అయితే, త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. రోడ్డు మీద ఆటోలు, ట్యాక్సీలను ఎక్కినట్టుగానే ఈ ఎయిర్ ట్యాక్సీలను ఎక్కి, గాలిలో ప్రయాణించొచ్చు. అంతేకాదు అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను సైతం అందించేందుకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నమూనా ఎయిర్ ట్యాక్సీని తాజాగా ఢిల్లీలో ప్రదర్శించింది.

ప్రయాణికులు సాధారణంగా ట్యాక్సీలను బుక్ చేసుకుని తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. అయితే, నగరాలల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ఇటు వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాదాచారులకు సైతం ఈ ట్రాఫిక్ కారణంగా చుక్కలు చూడాల్సి వస్తోంది. మరోవైపు శబ్ధ కాలుష్యం కూడా మితిమీరిపోతుంది. అయితే, ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఓ స్టార్టప్ కంపెనీ సిద్ధమైంది. అందులో భాగంగా వినూత్నంగా ఆలోచించింది. ఎయిర్ ట్యాక్సీ సేవలను అందించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేసింది. దీంతో ఎయిర్ ట్యాక్సీలో ఎక్కి గాలిలో ప్రయాణించే సదుపాయం త్వరలోనే రాబోతుంది. ఇండియాలో మొట్టమొదటి ఎయిర్‌ట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్‌ కంపెనీ తాజాగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో ఎయిర్‌ ట్యాక్సీ ‘శూన్య’ను బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ ‘సరళా ఏవియేషన్‌’ ఆవిష్కరించింది. ఈ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను 2028 నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని సదరు కంపెనీ వెల్లడించింది. ‘శూన్య’ ఎయిర్‌ ట్యాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కెపాసిటీని కలిగి ఉంది. 20 నుంచి 30 కిలోమీటర్ల స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ ఎయిర్ ట్యాక్సీని రూపొందించారు. ఇందులో ఆరుగురు ప్రయాణికుల వరకు ప్రయాణించేలా, మహా నగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నామంటూ కూడా శూన్య పేర్కొంది.

హైదరాబాద్‌లోనూ ఎయిర్ ట్యాక్సీ సేవలు…
గరిష్టంగా 680 కిలోల బరువును ఈ ఎయిర్ ట్యాక్సీ మోయనున్నదని శూన్య తెలిపింది. అయితే, అడ్రియన్ స్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు సరళా ఏవియేషన్ ను 2023 అక్టోబర్ నెలలో ప్రారంభించారు. వినూత్నంగా ఆలోచించిన ఈ స్టార్టప్ కంపెనీలో ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులు పెట్టారు. మొదటగా బెంగళూరులో ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి, ఆ తరువాత ముంబై, ఫూణె, ఢిల్లీ సహా ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆ తరువాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు వారు వివరించారు.

ధర కూడా తక్కువే…!
ఈ ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఖర్చు కాదంటా. ఇప్పటికే ఉన్నటువంటి ప్రీమియం ట్యాక్సీ సేవలతో సమానంగా ఎయిర్ ట్యాక్సీ ధరలకు సేవలందించనున్నట్లు సదరు ఏవియేషన్ సంస్థ స్పష్టం చేసింది. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు కార్ ట్యాక్సీల కంటే కొంత ఎక్కువగా మాత్రమే ఉండనున్నదని తెలుస్తోంది. దీంతో ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశముందని చెబుతున్నారు.

వాహ్.. భలే ఐడియా గురూ..
ఢిల్లీలో ఎయిర్ ట్యాక్సీ నమూనాను చూసి జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శూన్య కంపెనీ వినూత్నంగా ఆలోచించిదంటూ ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా ఎయిర్ ట్యాక్సీలను ఏర్పాటు చేస్తే చాలామంది వీటిని వినియోగించుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అయితే, సాధారణంగా హెలికాఫ్టర్లలో ప్రయాణం అంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని, కానీ, తక్కువ ధరలోనే ఎయిర్ ట్యాక్సీ సేవలను అందించేందుకు సిద్ధమవ్వడమనేది అభినందించదగ్గ విషయమంటున్నారు