కడప ఉక్కు కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు మాజీ ఎం.పి. ఈశ్వర్ రెడ్డి స్ఫూర్తితో పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కడప స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఫిబ్రవరి 1, 2, 3, తేదీలలో నెల్లూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర 27వ మహాసభల “గోడ పత్రాల” ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో సిపిఎం జిల్లా కమిటీ జనవరి 30, 31వ తేదీలలో “కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు” నినాదంతో “జీపు జాత” నిర్వహిస్తున్నామన్నారు. కడప ఉక్కుఫ్యాక్టరీని “శిలాఫలకాల ఫ్యాక్టరీ”గా మార్చిన ఘనత టిడిపి, వైఎస్ఆర్సిపిలదేనని ఎద్దేవ చేశారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు మాజీ జిల్లా ఎం.పి. పెద్ద పసుపుల ఈశ్వర్ రెడ్డి విశాఖ ఉక్కు కోసం మన పదవికి రాజీనామా చేశారని, వారి స్ఫూర్తితో కడప జిల్లాలోని ప్రజాప్రతినిధులు కడప ఉక్కు కోసం జిల్లా ప్రజలు పోరాడాలని కోరుతున్నామన్నారు. బిజెపి తనను బలపరిచే వారిని, సైతం భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, వి.అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు పి.దస్తగిరి రెడ్డి, బ్రహ్మంగారిమఠం మండల కార్యదర్శి జి.సునీల్ కుమార్ లు పాల్గొన్నారు.








