ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు జరగనుందని, దీనికి సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను అధికార యంత్రాంగం మొదలు పెట్టిందని విశాఖపట్టణం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29వ తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. 24 గంటల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రాంతాల్లో రాజకీయపరమైన పోస్టర్లు, ఫోటోలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా గురువారం ఉదయం డీసీపీ అజిత, జిల్లా రెవెన్యూ అధికారి, సహాయక రిటర్నింగ్ అధికారి బీహెచ్ భవానీ శంకర్ లతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నామినేషన్ల ప్రక్రియ, నోడల్ అధికారుల నియామకం, పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలను సూక్ష్మంగా వివరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉత్తరాంధ్ర పరిధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆర్వోలుగా, డీఆర్వోలు ఏఆర్వోలుగా వ్యవహరిస్తారని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 03 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 03వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుంచి అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11.00 నుంచి సాయంత్రం 03.00 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్, ఆర్వో హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10వ తేదీ సాయంత్రం 03.00 గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని, 11న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. 27వ తేదీ ఉయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 03వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 08వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని కలెక్టర్ వివరించారు. జనరల్ అభ్యర్థులు రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫారం-26 ద్వారా అఫడవిట్ సమర్పించాలన్నారు. అనుమతుల జారీకి సంబంధించి కలెక్టరేట్లో సింగిల్ విండో డెస్కు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా అన్ని రకాల నిబంధనలు అభ్యర్థులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.








