మోసానికి మారుపేరు చంద్రబాబు అని, సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని వైసీపీ రీజినల్ కో-ఆర్డిటనేర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నారు…ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నారని విమర్శించారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చానన్నారని, ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లడడం లేదన్నారు. హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు.. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులంటా మండిపడ్డారు. ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారని, ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఇచ్చారు చెప్పాలన్నారు. దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ కోవిడ్-19 సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీ ఇచ్చిన తేదీ ప్రకారం సంక్షేమాన్ని అందించారన్నారు. ఆ సంక్షేమం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు ఏపీకి వచ్చారని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారన్నారు. కానీ చంద్రబాబు అలా కాదని, సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉన్నా డబ్బులు లేవని దాట వస్తున్నారన్నారు. అంటే చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యం లేదని స్పష్టమౌతుందన్నారు. అధికారంలోకి వచ్చి ఆరోగ్య శ్రీతో పాటు, రాష్ట్రంలోని వైద్య విద్యను నిర్విర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారని, పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ లేదని గుండు సున్నా చేశారని, ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారని, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కూడా ఆనాడు చంద్రబాబుకి వంత పాడారని, ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఎమ్మెల్సీలు రామ సుబ్బారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.








