ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నిర్మలమ్మతో గూగ్లీ వేయించారు ప్రధాని మోదీ. ఈనెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు ప్రకటించింది. ఢిల్లీలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారి సంఖ్య 40 లక్షల మంది ఉండగా.. వారందరికీ బిగ్ రిలీఫ్ కలిగింది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపు లేకపోవడంతో లక్షలాది మంది వేతన జీవులకు భారీ ఉపశమనం కలిగినట్లయింది. అయితే ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు అంశమే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రత్యేకంగా ఆ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు దూరంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా ఆదాయపు పన్ను మినహాయింపు, గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి కీలక ప్రకటనలు చేసింది. ఢిల్లీలో మొత్తం జనాభా 3 కోట్లకు పైనే ఉండగా.. అందులో దాదాపు 1.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 45 శాతం మంది మధ్యతరగతికి చెందినవారే కాగా.. అందులో పన్ను చెల్లించేవారి సంఖ్య దాదాపు 40 లక్షలుగా ఉంది. గిగ్ వర్కర్ల సంఖ్య కూడా ఢిల్లీలో ఎక్కువగానే ఉంది. తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు రూ.12 లక్షలకు పెంచడంతో.. దేశవ్యాప్తంగా కోటి మందికి ఊరట పొందుతారని కేంద్ర ప్రభుత్వమే చెబుతుండగా.. అందులో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.








