బిసిలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడతారని ఆశించాం
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రేవంత్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ చేసిన సిఫారసులను సభలో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై కేటీఆర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 2001 నుంచి స్పష్టంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
42 శాతం పెడతారనుకున్నాం
ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడుతున్నరేమో అనుకున్నామని.. చివరకు ఏదో సర్వే రిపోర్ట్‌ని పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. అసెంబ్లీలో బీసీ కుల గణన నివేదికపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చారిత్రాత్మకమైన ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ తరహాలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి బిల్లు ప్రవేశపెడతారేమోనని.. ఆ బిల్లును శాసనసభలో ఆమోదింప చేసి.. చట్టబద్ధత కల్పిస్తారేమోనని రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ, ముఖ్యమంత్రి లేచి నాలుగు పేర్లు చదువుతున్నారు. మీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి గారు మీరే చెప్పారు’ అంటూ విమర్శించారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్
వెనుకబడిన కులాల వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. బీసీ కులగణన సర్వేను బీఆర్ఎస్ తప్పు బడుతుందని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కాడని ఆరోపించారు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశాడని , బీసీలను మోసం చేసినందుకు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని తిరగనియ్యం అని స్పష్టం చేశారు.








