వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మల్లన్న వ్యాఖ్యలు, వేర్వేరు సందర్భాలలో పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా మాటచ్లాడటం తదితర వాటన్నింటినీ క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తోంది. ఎమ్మెల్సీ మల్లన్న గత కొంత కాలంగా బీసీ నినాదాన్ని అందుకున్నారు. రాజ్యాధికారంలో బీసీలకు జరుగుతున్నఅన్యాయంపై పోరాడుతున్నారు. బీసీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకపోవడం, మెజారిటీ మంత్రి పదవులు అగ్రవర్ణాలకే ఉన్నాయంటూ తప్పుపట్టారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తానని అనేక సందర్భాలలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేసారు. మల్లన్న తీరుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు, పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మల్లన్న వ్యాఖ్యలను పరిశీలిస్తున్న కమిటీ నేడో, రేపో షోకాజ్ నోటీసు జారీ చేయాలని భావిస్తోంది. అయితే షోకాజ్ నోటీసులపై పార్టీ ముఖ్యులతో చర్చించిన అనంతరం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వరంగల్ లో జరిగిన బీసీ గర్జన సభలో మల్లన్న యొక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్ లోని పలువురు నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. గతంలోనూ ణల్లన్న బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను సీం రేవంత్ రెడ్డిని నిలదీస్తూ వ్యాఖ్యలు కూడా చేశారు.
మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 2 న వరంగల్ వేదికగా బీసీ సభను తీన్మార్ మల్లన్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెడ్డి కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, కుక్కలతో పోలుస్తూ దూషించారని ఆరోపణలు వస్తున్నాయి. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ పోలీసులకు రెడ్డి మహిళా సంఘం నేతలు ఫిర్యాదు చేయగా మంగళవారం డీజీపీ జితేందర్ ను కలిసిన రెడ్డి సంఘం నేతలు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రెడ్డి కులానికి మల్లన్న క్షమాపణలు చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి సంఘాల నేతలు తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








