జనసేన విజయాలపై మెగాస్టార్ చిరంజీవి గర్వంగా పొంగిపోతున్నాడు. జై జనసేన అంటూ నినదించారు. నాటి ప్రజారాజ్యపార్టీనే నేటి జనసేనగా రూపాంతరం చెందిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రకంపనలు తీసుకొచ్చారు. లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫంక్షన్కు వచ్చిన అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా.. జై జనసేన అంటూ నినదించారు. మెగాస్టార్ నోట జై జనసేన అని అనడం ఇదే ఫస్ట్ టైమ్. నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది.. జనసేనగా మారిందంటూ మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు.
నాడు ప్రభంజనం
2008 ఆగష్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18% ఓట్లు ఈ పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి గెలుపొందాడు. ఆగష్టు 2011లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడక్కడ పవన్ కల్యాణ్ తప్ప చిరంజీవి ఎప్పుడూ మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. అనూహ్యంగా లైలా వేడుకలో మళ్లీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మాట్లాడటంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.








