రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా నమ్మకముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కొడంగల్ నుంచి రపోటీ చేసి గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కొడంగల్ లో ఉప ఎన్నిక జరిగితే 50వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఒక వేళ నరేందర్ రెడ్డి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన రైతు దీక్షలో మాట్లాడిన కేసీఆర్ నేను నిజంగా రైతు నిరసన దీక్షకి వచ్చానా లేక కొడంగల్ లో ఉపఎన్నిక వచ్చి రేవంత్ రెడ్డి ఓడిపోయి పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక చేసే విజయోత్సవ ర్యాలీకి వచ్చానా అన్నట్టుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు అంటున్నారు కదా.. నేను కులగణన చేశా, బీసీలందరూ సంతోషంగా ఉన్నారు, రైతు బంధు వేశా రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతు కూలీలకు పైసలు వేశా వాళ్లు సంతోషంగా ఉన్నారు, ఇళ్ల కాగితాలు ఇచ్చా పేదలంతా సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు కదా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రండి. ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. మీకు మాట ఇస్తున్నాం, ప్రచారానికి మేము ఇంతమందిమి రాము, పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటకు కూడా రాడు, మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం, ఉప ఎన్నిక జరిగితే మేము గెలవడం కాదు 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా, రాజకీయంలో కూడా ఉండను అని సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి అన్నా, ప్రభుత్వం అన్నా ఎవరూ భయపడటం లేదని, ఇది వాస్తవమన్నారు. ఒక్క కొడంగల్ లోనే కాదు. రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖచిత్రం ఇది. 420 హామీలు ఇచ్చి మళ్లీ మోసం చేస్తానంటే కుదరదు. ఇవాళ రైతులు అడుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గర్జిస్తున్నారు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. జనాలు ఘోరంగా తిడుతున్నారంటూ రేవంత్ సర్కార్ పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏడాది కాలంగా కొడంగల్ లో కురుక్ష్రేతం మాదిరిగా యుద్ధం నడుస్తోందని, మా ప్రాంతపు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం బాగు పడుతుందని మీరంతా ఓట్లు వేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండని సభికులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. 14 నెలల పరిపాలనలో ఒక్క పని రైతుల కోసం, మహిళల కోసం, పెద్ద మనుషుల కోసం, యువత కోసం పని చేసింది లేదని మండిపడ్డారు. అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుడి కోసం, అదానీ కోసం, బావమరుదుల కోసం, ఆయన కుటుంబసభ్యులకు వేల కోట్లు దోచుకోవడానికి, ఇక్కడి భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు








