Mahaa Daily Exclusive

  సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేసి గెలవాలి స్థానిక సంస్థల్లో సత్తా చూపు కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే సవాల్….!

Share

కొస్గీ సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొడంగల్ లో గెలవడం పక్కకు పెట్టి త్వరలో జరుగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్క జడ్ పీటీసీ కానీ, ఒక్క ఎంపీటీసీని గానీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. రాజీనామాకు రేవంత్ రెడ్డి అవసరం లేదని నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. గతంలో కేటీఆర్, హరీష్ రావు కు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజీనామాపై కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే  సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలన్నారు. కేకే మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి  గెలిపించుకుంటామన్నారు. ఆరిపోయే దీపం లా కేటీఆర్  మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. జైలుకు పోతామన్న భయంతోనే ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ మాటలు ఫగటి వేషగాడిలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కొడంగల్ ను పట్టించుకోలేదని, లక్ష రూపాయల రుణమాఫీ కూడా సరిగా చేయకుండా రైతులను దగా చేశారని దుయ్యబట్టారు. కొడంగల్ యువతకు ఉపాధి కల్పించడం కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ దుష్పచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ను చంపించడానికి సురేష్ అనే వ్యక్తితో ప్రయత్నం చేయించారన్నారు. పారిశ్రామిక వాడ కోసం భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా లేఖలు ఇస్తున్నారని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామని, అసైన్డ్ భూములకు కూడా ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. ప్రతి రైతు కు అభివృద్ధి చేసిన 150 గజాల ప్లాట్ ఇస్తుండటం వల్ల రూ. 15 లక్షలు లభ్ది చేకూరుతుందన్నారు. భూములు ఇస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, కుటుంబానికో ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు. కొడంగల్ కు ఇప్పటికే మెడికల్ కాలేజ్ మంజూరు అయిందని, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశామని, కొడంగల్ అభివృద్ధి కోసం 6,128 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి కేటాయించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మా జిల్లాలో ఒక డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వక పోగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 45 వేల కోట్లతో ఒకే రోజు నాలుగు పథకాలను మా ప్రభుత్వం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు, ఆయన చెల్లెలు ఇప్పటికే తీహార్ జైలుకు పోయి వచ్చింది, కేటీఆర్ పైన ఎసీబీ, ఈడీ విచారణ జరుగుతోందంటూ ఆలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు.