పాలకొండ మండలంలోని జంపరకోట ప్రాజెక్టును బుధవారం రైతు సంఘ నాయకులు సందర్శించారు. మండలంలో గిరిజన రైతాంగానికి చెందిన నాలుగు పంచాయతీల పరిధిలో 2100 ఎకరాలులో సంవత్సరానికి రెండు పంటలు పండించడానికి సాగునీరు అందించడానికి జంపర కోట ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామం వద్ద పెద్దగెడ్డపై అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 1988లో 2.5 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించి పనులు చేపట్టగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 2006వ సంవత్సరం వరకు పనులు పూర్తి చేయకపోవడంతో అంచనా వ్యయం పెరిగి సుమారు 17 కోట్ల చేరుకోగా కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి అప్పుటి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదులో ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న చిన్న నీటి పారుదల సాగునీటి వనరులకు నిధులను కోరుతూ జరిగిన నిరాహార దీక్ష సందర్భంగా జంపర్ కోట రిజర్వాయర్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేస్తానని వైఎస్ రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఉంటే గిరిజనులు వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండేవారన్నారు. ఈ నేపథ్యంలో పాలకొండకు ఎన్నికల ముందు సందర్భాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దృష్టికి జంపరకోట సమస్య రాగా వారు కూడా ప్రాజెక్టు పనులు పూర్తి కావటానికి కావలసిన నిధులు ఇచ్చి గిరిజన రైతులకు అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అమలు చేయడానికి వచ్చే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు కావలసిన నిధులు కేటాయించాలన్నారు. ప్రాజెక్టును పరిశీలించిన వారిలో జంపర్ కోట గ్రామ సర్పంచ్ ఆరిక నారాయణరావు, సంఘం జిల్లా సీనియర్ నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు, పొట్నూరు లక్ష్మణరావు, మోహనరావు, రైతులు పాల్గొన్నారు.







