కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణన తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను కార్యకర్తలే తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు తండ్రి మీద కొడుకు మాదిరిగా అలక బూనిన మాట వాస్తవమని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. ప్రజల్లో సరిగ్గా ప్రచారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధ్యతను కార్యకర్తలే తీసుకోవాలన్నారు. కులగణన సర్వేను శాస్త్రీయ బద్దంగా ప్రభుత్వం నిర్వహించిందన్నారు. కుల సర్వే పై ప్రతిపక్షాలు పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నయని ఫైర్ అయ్యారు. అభివృద్ది , సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతతో కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో తొలిసారిగా కులగణన సర్వేను సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.







