Mahaa Daily Exclusive

  రవాణా సేవలో ఇబ్బందులు తలెత్తొద్దు పాఠశాలల్లోనూ రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌..!

Share

రవాణా సేవలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కొత్తగా నియామకమైన ఆర్టీఏ సభ్యులకు సూచించారు. నూతనంగా నియమితులైన ఆర్టీఏ (నాన్ ఆఫీషియల్) సభ్యులను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా నియామకమైన వారితో సచివాలయం లోని తన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 24 మందికి ఆర్టీఏ సభ్యులుగా అధికారిక నియామక పత్రాలు వచ్చాయని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. కొత్తగా నియామకమైన ఆర్టీఏ సభ్యులు ప్రజల సౌకర్యార్థం, రవాణా సేవల్లో వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. 63 రవాణా శాఖ కార్యాలయాల్లో 31 కార్యాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉందని, ఎనిమిది ప్రాంతాల్లో రవాణా శాఖ కార్యాలయాలకు స్థలాలు ఉన్నాయని, ఇతర కార్యాలయాల్లో స్థలాల కోసం జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ల్యాండ్ కేటాయించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సభ్యులు రవాణా శాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలని, వారానికి రెండు స్కూల్ లలో ట్రాఫిక్ అవేర్నెస్ పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, ఆర్టీఏ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.