తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి మందకోడిగా సాగిన పోలింగ్ ప్రక్రియలో.. చివరి సమయంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. అయితే.. నాలుగు గంటలలోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. పట్టభద్రులతో పోల్చితే.. టీచర్సే ఎక్కువగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. వరంగల్-నల్గొండ- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి.. 93.55 పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది.
నల్గొండలో 90 శాతం పోలింగ్ నమోదు కాగా.. వరంగల్ జిల్లాలో 80 శాతం పోలింగ్ దాటినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోనూ 80 శాతం దాటింది. ఇక.. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో.. 77.95 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం.
మెదక్- నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల్లో మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు కాగా.. 181 ఉపాధ్యాయుల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ మార్చి 3వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
మెదక్- నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తంగా 3,55,159 మంది ఓటర్లు ఉండగా.. ఈ స్థానానికి 56 మంది పోటీ చేశారు. అయితే.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఆల్‌ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యే నెలకొంది. ఇక మెదక్- కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ -టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మధ్య పోటీ నెలకొంది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ జరిగింది. ఎవరు గెలిచినా మూడో ప్రాధాన్యత ఓటుతోనే గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 56 మంది అభ్యర్థులు ఉన్నా.. నాలుగు, మూడు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియతోనే విజేత తేలే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గెలుపు అవకాశాలు ఎవరికంటే..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటినుంచి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీచేశారు. ఈ ఇద్దరూ విజయంపై ధీమాగా ఉన్నారు. పార్టీ కేడర్‌తో పాటు ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తనను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారనేది ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తుది ఫలితం ఎలాఉన్నా మొదటి మూడు స్థానాల్లో మాత్రం నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ముగ్గురిలో రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లు అధికంగా పొందిన అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీ వాదం గట్టిగా వినిపించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన పట్టభద్రులు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని డిసైడ్ అయితే మాత్రం ప్రసన్న హరికృష్ణ మొదటి లేదా రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ టికెట్ ఆశించి.. టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ వైపు పట్టభద్రులు మొగ్గుచూపారనే ప్రచారం ఎక్కువుగా జరుగుతోంది. ప్రధానపోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ మధ్య ఉండొచ్చని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది.
రెండో ప్రాధాన్యత ఓటుతో..
ప్రసన్న హరికృష్ణ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఆయన అధికారపార్టీ వైపే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో కొందరు ప్రసన్న హరికృష్ణకు లోపాయికారిగా సహకరించారనే ప్రచారం జరిగింది. దీంతో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన కాంగ్రెస్ సానుభూతిపరులు తప్పకుండా రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేసే అవకాశం ఉంది. అలాగే అంజిరెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణకు వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి పోటీచేస్తున్న శేఖర్ రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన ఓటర్లలో ఎక్కువమంది ప్రసన్న హరికృష్ణకు రెండో ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో ప్రసన్న హరికృష్ణ గెలుస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.








