కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా రంగారెడ్డి జిల్లాకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రాష్ట్ర జనాభాలో సగం జనాభా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నారన్నారు. సగం జనాభా ఉన్న చోట ఒక్క మంత్రి కూడా లేడన్నారు. గెలిచిన వాళ్లలో తాను ఒక్కడినే ఉన్నట్లు చెప్పారు. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని పేర్కొన్నారు. సామాజిక వర్గాలకు న్యాయం జరగడం లేదునుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, పార్టీ ఎవరిని గెలిపించమని ఆదేశిస్తే వారిని గెలిపిస్తానని సంచలన ప్రకటన చేశారు. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవారని గుర్తుచేశారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానిక నేతలకు మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి కానీ పదవులు ఇవ్వొద్దు అని కోరారు. కొత్తగా చేరిన వాళ్లను మంత్రులుగా తీసుకోవద్దని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదని హితవు పలికారు. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పదేళ్ళ పాటు పార్టీ కోసం కష్టపడ్డ వారు చాలా మంది ఉన్నారని, బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఇబ్బందులకు గురైనవారున్నారన్నారు. వారందరికీ ఇప్పుడు పార్టీ గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.








