రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుండి నిర్వహించే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుండి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులుసహా ప్రతి ఒక్కరూ లంచ్ చేసే సమయమని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తరువాత విధుల నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చారని, పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయన్నారు. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. ఒక వర్గం వారిని మెప్పించేందుకు యావత్ విద్యార్థుల కడుపు మాడ్చడం న్యాయమా? అని నిలదీశారు
తబ్లిగీ జమాతే వంటి విదేశాల్లో నిషేధిత సంస్థ మన రాష్ట్రంలో సభలు నిర్వహించుకుంటే ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారని, రంజాన్ కు డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారు, రంజాన్ కు బహమతులు అందిస్తారు, మక్కా వెళ్లేందుకు ఉచిత వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారు, కానీ అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వడం లేదన్నారు. హిందూ పండుగలకు ప్రత్యేక నిధులూ కేటాయించరు కానీ పైగా నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టిలో ఇదేనా సమానత్వమంటే? హిందువులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా? కాంగ్రెస్ తీరు తీవ్ర అభ్యంతరకమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా 10వ తరగతి ప్రీఫైనల్ పరీక్షా టైం టేబుల్ ను మార్చాలని కోరారు.








