16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈనెల 1వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలకు సినీ ప్రముఖులు ఎవరూ రాకపోవడంపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పై కాంగ్రెస్ ఎమ్మెల్యే (కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం) రవి గనిగ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరయ్యేందుకు రష్మిక నిరాకరించినట్లు చెప్పారు.
తన కెరీర్ను ప్రారంభించిన పరిశ్రమను రష్మిక విస్మరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కర్ణాటకలో కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తో తన కెరీర్ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయితే, గతేడాది అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి తాము ఆహ్వానం పంపితే నిరాకరించిందని మండిపడ్డారు. ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మికను ఆహ్వానించేందుకు మా ఎమ్మెల్యే స్నేహితుల్లో ఒకరు ఆమె ఇంటికి 10 నుంచి 12 సార్లు వెళ్లారు. కానీ ఆమె ఈవెంట్కు హాజరయ్యేందుకు నిరాకరించారు. నా ఇల్లు హైదరాబాద్లో ఉందని చెప్పారు. ఈవెంట్కు వచ్చేందుకు తనకు సమయం కూడా లేదని.. రాలేనని చెప్పారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమె కెరీర్ ప్రారంభించినప్పటికీ.. కన్నడ భాషను విస్మరించారు. అగౌరవపరిచారు. కన్నడను విస్మరించిన రష్మికకు మనం గుణపాఠం నేర్పించకూడదా?’ అంటూ గనిగ వ్యాఖ్యానించారు.








