ప్రముఖ సామాజిక, పర్యావరణ వేత్త మేధా పాట్కర్ హైదరాబాద్‌లో పర్యటించారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారిని పరామర్శించారు. బీఆర్‌కే భవన్‌లో మంగళవారం వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎస్ రెడ్డి, భవానీ రెడ్డి, గంగాధర్ తదితరులతో మేధా పాట్కర్ సమావేశమయ్యారు. రెండ్రోజులుగా నగరంలో తన పర్యటన, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయిన వారి సమస్యలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతుల గురించి కమిషన్‌తో చర్చించారు. మూసీ రివర్ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర భూములు, వ్యవసాయ భూములు కోల్పోయిన వారికీ ఆర్థిక సాయం, భూమికి బదులు మరోచోట భూములు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఫోర్త్ సిటీ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. మూసీ నది పూర్వ వైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం… పరివాహక ప్రాంత ప్రజలతో చర్చల ద్వారా ముందుకెళ్లాలని, పేదలకు పునరావాసం కల్పించడంలో జాగ్రత్తలు పాటించాలని ఈ సమావేశంలో మేధా పాట్కర్ కొన్ని సూచనలు చేశారు.








