పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పుపట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్ కేర్ గదుల ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. అంతేగాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పనిప్రదేశాల్లోనూ తల్లిపాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవ్వుతారంటూ యూఎన్ నివేదికను వెల్లడించింది.
అలాగే తల్లిపాలిచ్చే హక్కుని గురించి కూడా నొక్కి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం, 2015 జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంల నుంచి ఈ హక్కు ఉద్భవించిందని ధర్మాసనం తెలిపింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్ గదులు, క్రెచ్లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఇలా తీర్పుని వెల్లడించింది. అంతేగాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(3) కింద ఉన్న ప్రాథమిక హక్కులకు అనుగుణంగా కేంద్రం సలహా ఉందని ధర్మాసనం పేర్కొంది.








