తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు, సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం శనివారం ప్రజాభవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల ఎంపీలతో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు స్వయంగా భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే భట్టి ఆహ్వానంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల సమావేశానికి హాజరుకాకూడదని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. భట్టి పంపిన లేఖ ఆలస్యంగా అందిందని, ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు.
కిషన్ రెడ్డి లేఖ ఇదే…
భట్టి పంపిన ఆహ్వానం ఆలస్యంగా అందిందని, సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదని కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు. ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార, అనధికార కార్యక్రమాలతో ఎంపీల సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉందని, చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి తాము కృషి చేస్తూనే ఉంటామని లేఖలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.








