రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ తమకు చెప్పాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అనవసర ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఓట్లు, జనాభా తగ్గినా.. ఒక్క పార్లమెంట్ సీటు తగ్గదని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను ఎవరిపై బలవంతంగా రుద్దడం లేదంటూ తప్పుడు ప్రచారాలతో దేశానికి, ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందు లిఖితపూర్వకంగా అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలకు అతీగతీ లేదన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులు ముందు వేసుకుని లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యిందని, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ పురోగతిపై కాంగ్రెస్ మంత్రులు వరంగల్ వెళ్లి చూసి రావాలని సలహా ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జాతీయ రహదారులను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కిలో మీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారులను నిర్మించినట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే పూర్తయిన రహదారులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రానున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) గురించి కూడా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు తెలిపారు. ఫైనాన్స్‌కు సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని అంచనా వేసిన అధికారులు అందుకు సంబంధించిన అంచనా వ్యయాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఆరాంఘర్ నుంచి శంషాబాద్‌కు ఆరు లేన్ల హైవే కూడా ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. వీటితో పాటు బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ కూడా తుదిదశకు చేరుకుందని, వచ్చే నెలలో పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తయితే కూకట్‌పల్లి పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. . ఈ ఫ్లైఓవర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా వెళ్లొచ్చని, పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జాతీయ రహదారి 61 (17 కి.మీ), ఎన్‌హెచ్ 65 (22 కి.మీ.) పూర్తి అయ్యింది. జనగాం – దుద్దెడ మార్గంలో భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఇస్తే అంతే త్వరగా రోడ్డు పూర్తి చేస్తామన్నారు. ఖమ్మం – విజయవాడ మధ్య వెంకటాయపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు








