Mahaa Daily Exclusive

  పదేళ్లలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చాం మహిళా దినోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ…!

Share

తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. మహిళాభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, ఆడకూతుళ్ల ఆశీస్సులు తన లైఫ్ అకౌంట్‌లోకి వచ్చిచేరాయని, నిరంతరం వారి ఆశీస్సులు పెరుగూతునే ఉన్నాయని, ప్రపంచంలో తనకంటే ధనవంతుడు మరొకరు లేరని మోదీ అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా గుజరాత్‌ లోని నవసరి జిల్లాలో జి-సఫల్, జి-మిత్రతో సహా పలు పథకాలను ప్రధాని ప్రారంభించారు. లఖ్‌పతి దీదీలతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పటేల్ పాల్గొన్నారు.

అమ్మాయిలు ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారని, కానీ అబ్బాయిల విషయంలోనూ అలాగే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చి, నిబంధనలు, చట్టాలను మార్చామని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని గాంధీ చెప్పారని, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా భావిస్తున్నానని అన్నారు. ముస్లిం మహిళల జీవితాలను నిలబెట్టేందుకు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చామని గుర్తు చేశారు. మహిళల సారథ్యంలో ఎన్నో సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన అన్నారు. కోట్లాది మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదం కలిగిన తాను ప్రపంచంలోనే అత్యంత ధనికుడినని వ్యాఖ్యానించారు. గుజరాత్ సఫల్, గుజరాత్ మిత్రా పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన మోడీ అనేక పథకాల సొమ్మును నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే బదిలీ చేస్తున్నామన్నారు. ”ఈరోజు నారీలోకానికి అంకితమైన రోజు. మహిళల నుంచి స్ఫూర్తి పొందాల్సిన రోజు. వారి నుంచి ఎంతోకొంత నేర్చుకోవాల్సిన రోజు. ఈరోజు నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడనని గర్వంగా చెప్పుకుంటున్నాను. కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, ఆడకూతుళ్లు నిరంతరం ఆశీస్సులు అందజేస్తున్నారు. నాకంటే సంపన్నుడు ఈ ప్రపంచంలోనే లేరు” అని మహిళల హర్షధ్వానాల మధ్య మోదీ చెప్పారు. ఐదుగురు లఖ్‌పత్ దీదీలను లఖ్‌పతి దీదీ సర్టిఫికెట్లను మోదీ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా జి-సఫల్ (జీవనోపాధిని పెంచే అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జి-మిత్ర పథకాలను ప్రారంభించారు. జి-మిత్ర పథకం కింద గ్రామీణ జీవనోపాధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి పని చేస్తున్న స్టార్టప్‌లకు ఆర్థక సాయం అందిస్తారు. జీ-సఫల్ పథకం కింద అంత్యోదయ కుటుంబాలకు చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థిక సాయం, వ్యవస్థాపక శిక్షణ అందిస్తారు