Mahaa Daily Exclusive

  అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం – సీఎం రేవంత్ రెడ్డి

Share

అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలు రాణించాలంటే చదువుకోవాలని ఆయన పేర్కొన్నారు. కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో నూతన భవన నిర్మాణాలకు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐలమ్మ యూనివర్సిటీ విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలతో పోటీ పడాలని ఆకాంక్షించారు. మహిళలకు అవకాశం లభిస్తే వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, స్వయం సహాయక సంఘాల ద్వారా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి సోలార్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుందని, అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని, మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నానన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించామని వివరించారు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని.. వారు వ్యాపారవేత్తలుగా రాణిస్తారన్న భావనతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అంతకుముందు విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్‌ను సీఎం సందర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు