ప్రస్తుత బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏడాది పొడుగూతా ఉత్సవాలను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ రోజున వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఖరారు చేశారు. వరంగల్ సమీపంలో సభకు అనువైన ప్రదేశాలను పరిశీలించి, త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుకు, సహకార బాధ్యతలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. త్వరలోనే సభ నిర్వహణ కమిటీలను కూడా వేయనున్నారు. పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలను ఏడాది పాటు ఘనంగా, తెలంగాణ సమాజం గర్వించేలా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కువగా దృష్టిసారించాలని.. భారీగా ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత సూచించారు. బీఆర్ఎస్ ను ప్రజలు తెలంగాణ ఇంటి పార్టీగా భావిస్తారని, ప్రస్తుతం జనం అనేక కష్టాల్లో ఉన్నారంటూ ప్రజాసమస్యలపై మరింతగా పోరాడదామని పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంతోపాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అందుకనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారని, ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నాం, పదేళ్లపాటు ఎంతో అప్రమత్తతతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నామన్నారు. అంతటి గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ సమాజం ఇప్పుడు కష్టాల్లో ఉందన్నారు. ఇలాంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవాలు కేవలం పార్టీకే పరిమితం కావొద్దని, యావత్ తెలంగాణ సమాజానికి ఇందులో భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచీ కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ ఈ సమాజానికి రక్షణ కవచం వంటిదన్నారు. ఈ విషయం గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలను, వాగ్దానాలను నమ్మిన ప్రజలు.. నేడు రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారని, ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎశ్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
వరంగల్ బహిరంగ సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలన్న కేసీఆర్ త్వరలో కమిటీలను వేస్తామన్నారు. సభ అనంతరం పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ఠ పరిచి, ఆ దిశగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత నూతన కమిటీల బాధ్యులతో ప్రతినిధుల సభను నిర్వహిస్తాంమని, శిక్షణ తరగతులు కూడా చేపడతామన్నారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగానే పని చేస్తోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసుకొని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంటులో లేకపోవడం వల్ల రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ ఈ విషయాన్ని ప్రజలకు మరింతగా అర్థమయ్యేలా చెప్పాలని పార్టీ నేతలకు సూచించారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం ఉంటే లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానమేంటో స్పష్టమైన తర్వాత.. రాష్ట్రానికి జరగనున్న నష్టంపై స్పందించాలని నిర్ణయించారు.








