ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్ళకుండానే ఎమ్మెల్సీల జాబితా ప్రకటన రానుంది. లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నాలుగుస్థానాలు దక్కనుండగా, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మోస్ట్ ఎలిజిబుల్ లీడర్ అద్దంకి దయాకర్ లకు ఖరారైనట్లు తెలుస్తోంది. మరో రెండు స్థానాలకు సంబంధించి రకరకాల ప్రత్యామ్నాయాలను అధిష్టానం పరిశీలిస్తోంది. కుసుమకుమార్, విజయాబాయి పేర్లు ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు ఖరారైన తర్వాత కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశాలున్నాయి. బిసిలకు ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఇచ్చినందున ఈ దఫా బిసిలకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు. ఇవి కాకుండా ప్రత్యామ్నాయాలు పరిశీలించాల్సి వస్తే సామా రామ్మోహన్ రెడ్డి, వీహెచ్, అంజన్ కుమార్, షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషీ, చరణ్ కౌశిక్, సత్తు మల్లేష్, పారిజాత నర్పింహారెడ్డి, ఇరావత్రి అనిల్ తదితరుల పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశముంది. ఆదివారం రాత్రి వరకు తుదిజాబితాను విడుదల చేసే అవకాశముంది. ఆదివారం ఉదయం 11గంటల ప్రాంతంలో కేసీ వేణుగోపాల్ ఫోన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో మరోసారి మాట్లాడి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
……….








